రైతన్నల విషయంలో దాష్టీకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
సమరశంఖం పూరించారు. జిల్లాల్లో పర్యటిస్తూ అన్నదాతకు అండగా ఉన్నానని భరోసా కల్పిస్తున్నారు. ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించిన ఆయన, ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఎండిన పంటలను పరిశీలిస్తారని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలంలోని ముగ్ధుంపూర్, చెర్లభూత్కూర్‌లో మొదలయ్యే కేసీఆర్ పర్యటన సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌తో ముగియనున్నది.
– కరీంనగర్, మార్చి 31 (నమస్తే తెలంగాణ)
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ తెచ్చిన అనేక సంస్కరణలు, వినూత్న పథకాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. అనేక కష్ట నష్టాలకు ఓర్చిన కేసీఆర్ సర్కారు రైతులకు అండగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక వదిలేసిన అనేక ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు కాళేశ్వరం వంటి మహా ప్రాజెక్టుల నిర్మాణంతో రైతాంగానికి నిండు వేసవిలోనూ పుష్కలంగా నీటిని అందించింది. మండే ఎండల్లోనూ మారుమూల గ్రామాల్లో చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకే పరిస్థితిని తీసుకువచ్చింది.
ఏటా రెండు పంటలు తీసి ధాన్యపు రాసులు పండించిన రైతన్నలకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పాత రోజులను గుర్తుకు తెచ్చింది. రైతు రుణాలు మాఫీ చేస్తామని, రైతుబంధు పెంచి అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఒక్కటి కూడా అమలు చేయలేదు. సాగునీరు లేక పంటలు కండ్ల ముందే ఎండి పోతుంటే రైతులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలబడి, ఎండిన పంటలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ అధినేత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు రానున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎలాంటి కష్టాలైతే పడ్డారో మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చిన వంద రోజుల్లోనే అవే కష్టాలను అనుభవిస్తున్నారు. జిల్లాలో సాగు చేసిన పంటలు నీళ్లు లేక ఎక్కడికక్కడ ఎండి పోతున్నాయి. ఇది భరించలేని రైతులు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమం గురించి పాటుపడిన బీఆర్ఎస్ అధికారంలో లేకున్నా వారికి అండగా నిలుస్తోంది. ముఖ్యంగా వరద కాలువకు నీళ్లు ఇవ్వాలని చొప్పదండి నియోజవర్గంలో రైతులు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వారికి అండగా నిలువగా, దిగివచ్చిన సర్కారు ఆదివారం వరద కాలువకు 0.1 టీఎంసీ నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది.
ఎస్సారెస్పీ పరిధిలోని అనేక డిస్ట్రిబ్యూటరీల కింద ఎండుతున్న పంటలను రక్షించాలని పెద్దపల్లిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 36 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఉమ్మడి జిల్లా పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రైతులకు అండగా నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న కేసీఆర్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. రైతులు కూడా కేసీఆర్‌కు తమ బాధలు, సాగు నీటి కోసం పడుతున్న కష్టాలను చెప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఎండిన పంటలను పరిశీలించి రైతులకు అండగా ఉన్నామని భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ అధినేత ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు కరీంనగర్ మండలంలోని ముగ్ధుంపూర్, చెర్లభూత్కూర్‌లో ఎండిన పంటల పరిశీలినతో పర్యటన మొదలవుతుంది. ఇక్కడి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడి నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, బోయినపల్లి మండలాల్లో, వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ మండలంలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. తర్వాత సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహిస్తారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కరీంనగర్‌లోని పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ నివాసంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, వినోద్‌కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, తదితర ముఖ్యనాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఈ నెల 5న కేసీఆర్ పర్యటిస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో దగాపడిన రైతన్నకు అండగా నిలిచేందుకు కేసీఆర్ పొలం బాట పట్టారని తెలిపారు.ఎండి పోయిన పంటలను పరిశీలించి, రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని చెప్పారు. సమావేశంలో నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఏనుగు రవీందర్ రెడ్డి, గడ్డం చుక్కారెడ్డి, ద్యావ మధుసూదన్‌రెడ్డి, శ్రీనాథ్ గౌడ్, అజిత్ రావు, సిద్ధం వేణు, జక్కుల నాగరాజు పాల్గొన్నారు.