కరీంనగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : నిరుపేద కుటుంబంలో పుట్టి కార్మికుడిగా మొదలైన కొప్పుల ఈశ్వర్ రాజకీయ ప్రస్థానం రాష్ట్ర మంత్రి వరకు కొనసాగింది. నిరాడంబరత, నిండైన వ్యక్తిత్వం మూర్తీభవించిన కొప్పుల 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ‘ఒక ప్రస్థానం’ పేరుతో పెద్దపల్లికి చెందిన ప్రముఖ రచయిత నూతి మల్లన్న ఒక పుస్తకాన్ని రచించారు. ఆదివారం కొప్పుల ఈశ్వర్ 67వ జన్మదినం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా హైదరాబాద్‌లో దీనిని ఆవిష్కరిస్తున్నారు. ఇదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ అధ్యక్షతన పుస్తక పరిచయ సభ కూడా నిర్వహిస్తుండగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొంటున్నారు.
నిరుపేద ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొప్పుల లింగయ్య, మల్లమ్మకు జన్మించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనేక కష్టాల నుంచి తన జీవన ప్రస్థానాన్ని ప్రారంభించారు. హమాలీగా, బొగ్గు గనుల్లో కూలీగా, చివరికి సింగరేణిలో కార్మికుడిగా చేరి గోదావరిఖనిలో స్థిరపడ్డారు. కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై ఆయన క్రమంగా విప్లవ కార్మికోద్యమం వైపు మళ్లారు. సీపీఐ ఎంఎల్ అనుబంధంగా ఏర్పాటు చేసిన గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం వ్యవస్థాపక సభ్యుల్లో ఈశ్వర్ ఒకరు. అనేక కేసులు పెట్టినా కార్మిక వర్గ పోరాటాలను మరింత ఉధృతంగా నిర్వహించే వారు. సీపీఐ ఎంఎల్ పార్టీకి అత్యంత సన్నిహితుడైన నిజామాబాద్ జిల్లా రాయకూరుకు చెందిన ఎలవర్తి సుబ్బారావు చిన్న కూతురు కోకిలతో 1982 జూలై 15న వివాహం జరగగా, ఆమె తన పేరును ప్రముఖ విప్లవకారిని స్నేహలతగా మార్చుకున్నారు.
విప్లవోద్యమంలో వీరిరువురు కలిసి పని చేసేవారు. 1984లోటీడీపీలో చేరగా, క్రమంగా ఎదుగుతూ 1994లో మేడారం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ టికెట్ పొందారు. ఆ ఎన్నికల్లో ఓడిపోగా.. అటు ఉద్యోగం కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. అయినా, రాజకీయాల్లో స్థిరంగా నిలబడ్డారు. 2001లో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన టీఆర్ఎస్లో చేరి, 2004 ఎన్నికల్లో గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన కారణంగా మేడారం వదిలి ధర్మపురి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ఈశ్వర్ సేవలను గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించారు. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పులకు అవకాశం వచ్చింది. కోట్లాది నిధులు తెచ్చి ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపారు.