చొప్పదండి/ హుజూరాబాద్, అక్టోబర్ 18: బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు బీ ఫాంలు తీసుకోవడంతో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ తమను ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారికి మద్దతుగా ఆయా మండలాల్లోని గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో పార్టీ శ్రేణులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల కోసం వారి కుటుంబ సభ్యులు వాడవాడనా తిరుగుతూ బొట్టు పెట్టి, చేతిలో చెయ్యేసి ఓటు వేసి దీవించాలని కోరుతున్నారు. కాగా, బుధవారం మంత్రి, ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎండపల్లి మండలంలోని మారేడుపల్లి, ఉండేడ, ముంజంపల్లి గ్రామాల్లో ప్రజా ఆశీర్వదయాత్ర చేశారు. మహిళలు బొట్టుపెట్టి మంగళ హారతులు, బతుకమ్మలతో స్వాగతం పలుకగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
మెట్పల్లి మండలం బండలింగాపూర్‌లో కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. చొప్పదండి మండలంలోని ఆర్నకొండ, రాగంపేట గ్రామాల్లో ఎమ్మెల్యే, అభ్యర్థి సుంకె రవిశంకర్ ఇంటింటికీ తిరిగి ఓటు అభ్యర్థించారు. హుజూరాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి జెండా ఊపి ప్రచా రథాలను ప్రారంభించారు. జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్‌కుమార్‌ను రెండో సారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి రాధిక, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత జగిత్యాల పట్టణంలోని 34వ వార్డులో బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే, అభ్యర్థి కోరుకంటి చందర్ బస్తీ నిద్రలో భాగంగా యైటింక్లయిన్‌కాలనీ అయ్యప్పస్వామి ఆలయంలో నిద్ర చేసి బుధవారం తెల్లవారుజామునే వకీలుపల్లి గని, ఓసీపీ-3 ప్రాజెక్టులోని అమ్మవారి దేవాలయల వద్ద ప్రత్యేక పూజలు చేసి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే, అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ పెద్దపల్లిలోని 26వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెద్దంపేట, లక్ష్మీపురం, ఇద్లాపూర్ గ్రామాల్లో మనోహర్‌రెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి ప్రచారం చేశారు.