వేములవాడ, ఆగస్టు 24: తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, ఎలాంటి గ్రూపులూ లేవని, అందరది ఒక్కటే బీఆర్ఎస్ గ్రూపని ములవాడ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు స్పష్టం చేశారు. వేములవాడ రాజన్నకు సేవ చేసే భాగ్యం తనకు వచ్చిందని, ఎమ్మెల్యే రమేశ్‌బాబుతోపాటు అందరినీ కలుపుకొని ముందుకెళ్తానని చెప్పారు. తనకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడింట్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం వేములవాడ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు నాయకత్వంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధితోపాటు తాను కూడా అదే స్థాయిలో పనిచేసేందుకు ఆయనతో కలిసి ముందుకు వెళ్తామని అన్నారు.
విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు టికెట్ రావడం ఈ ప్రాంతానికి సేవ చేసే భాగ్యం లభించినట్లు భావిస్తున్నానని చెప్పారు. మనోహర్‌రెడ్డితోపాటు ఎవ్వరితోనూ విభేదాలు లేవని, అందరితో కలిసి ముందుకు వెళ్తామన్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్న ఆయనకు కూడా సముచిత స్థానం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య, కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, జిల్లా సర్పంచ్ ఫోరం కార్యదర్శి సంతోష్, నాయకులు గజనందరావు, సుంకపాక రాజు, బాబు ఉన్నారు.