జగిత్యాల,అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): పోరాటాల పురిటిగడ్డ. ఉద్యమాల ఖిల్లా అయిన జగిత్యాల మరో జైత్రయాత్రకు కేంద్రం అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. రాజకీయపరమైన చైతన్యం కలిగిన జగిత్యాల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 61వేలకు పైచిలుకు మెజార్టీతో రాష్ట్రంలో గులాబీ జైత్రయాత్రను ఆరంభించిన విషయం తెలిసిందే. త్వరలో జరుగనున్న రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో సైతం అదే ఫలితం పునరావృతమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల ఓటర్ల నుంచి సానుకూల స్పందన వస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా కదనుతొక్కుతున్నాయి.
తొమ్మిదేండ్ల వ్యవధిలో ముఖ్యంగా ఐదేండ్ల తన పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ఊతంగా జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ నియోజకవర్గ ఎన్నికల రణక్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఒకనాడు సామాజిక ఉద్యమాలు, తీవ్రవాద పోరాటాలకు కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరుగగా, మెజార్టీ సార్లు కాంగ్రెస్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే 2018లో మాత్రం నియోజకవర్గ పూర్వలెక్కలు తారుమారయ్యాయి. తొలి నుంచి కాంగ్రెస్, టీడీపీల మధ్యనే పోరు నెలకొని ఉండగా, స్వరాష్ట్ర అవతరణ తర్వాత నుంచి ఇక్కడి రాజకీయ పరిస్థితుల్లో మార్పులు జరిగాయి.
2014లో నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత, జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సంజయ్‌కుమార్ నియోజకవర్గంలో గులాబీదళ స్థిరీకరణ కోసం శ్రమించారు. ఎంపీగా కవిత భారీ మెజార్టీతో విజయం సాధించగా, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి చేతిలో డాక్టర్ సంజయ్‌కుమార్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించిన సంజయ్‌కుమార్ నిరంతరం ప్రజలతో మమేకమయ్యారు. ఎంపీ కవిత మార్గదర్శనంలో ఇన్చార్జి హోదాలో నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు.
70 కోట్లతో బోర్నపెల్లి వంతెన, 136 కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్టు, ప్రభుత్వ దవాఖానలో ప్లేట్లెట్ మిషన్, 17 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు, కిడ్నీ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు, 25 కోట్లతో కుల సంఘ భవనాల నిర్మాణం, అన్ని వర్గాల ప్రార్థన మందిరాలకు విరివిగా నిధుల మంజూరు, మహిళా సంఘ భవనాలు, 9 కోట్లతో సీఎంఆర్ఎఫ్ నిధుల మంజూరు ఇలా అనేక చర్యలు తీసుకోవడంతో జగిత్యాలలో గులాబీ పార్టీకి పట్టు చిక్కింది. దీనికి తోడు 40వేల మందికి ఆసరా, జీవనభృతి తదితర పెన్షన్లు, వేలాది మందికి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం, 42వేల మందికి రైతుబంధు పథకాన్ని వర్తింపుతో బీఆర్ఎస్కు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2018లో 61వేలకు పైచిలుకు ఓట్లతో డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిని ఓడించి రికార్డు సృష్టించారు.
సంక్షేమానికి పెద్దపీట
2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డాక్టర్ సంజయ్‌కుమార్ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వర్తింపజేయడంలో విజయవంతమయ్యారు. 40వేలు ఉన్న పెన్షన్ల సంఖ్య ఐదేండ్ల కాలంలో 63వేలకు పెరిగింది. 20వేల ఎకరాల్లో ఉన్న వరిసాగు 67వేల ఎకరాలకు చేరుకుంది. 511 కోట్ల వ్యయంతో జగిత్యాలలో నూతన మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రారంభం కాగా, 27 కోట్ల వ్యయంతో ఇప్పటికే మెడికల్ కాలేజీ తాత్కాలిక భవనంలో ప్రారంభమైంది.
ఈ కాలేజీకి అనుబంధంగా 350 పడకల ప్రధాన దవాఖానను ప్రారంభించారు. జగిత్యాల ఏరియా దవాఖానలో పెద్ద సంఖ్యలో వైద్యుల భర్తీ జరగగా, సిటీ స్కాన్, వైరాలోజి లాంటి ల్యాబ్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ‘మన ఊరు-మన బడి’ పథకం కింద 67 పాఠశాలలు మొదటి దశలోనే ఆధునీకరణ చెందాయి. వేలాది మందికి రైతుబంధు, రైతుబీమా అమలు చేయడం మొదలైంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలు అర్హులందరికీ సాచ్యురేషన్ పద్ధతిలో అందజేయబడ్డాయి. ముఖ్యంగా దాదాపు 300 కోట్ల వ్యయంతో 4వేల డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇలా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడంతో జగిత్యాల నియోజకవర్గంలో గత ఎన్నికల కంటే సానుకూల వాతావరణం ఏర్పడింది.
కవిత మార్గదర్శనంలో సంజయ్‌కుమార్ దూకుడు
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ మార్గదర్శనంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ప్రజాక్షేత్రంలోకి చొచ్చుకుపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి మండలంలోనూ ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేశారు. సంజయ్‌ని గెలిపించే దిశలో భాగంగా ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వారిని కార్యోన్ముఖుల్ని చేశారు. ఇటీవలే రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జగిత్యాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించి, సంజయ్ కుమార్ గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సైతం వీలు చిక్కినప్పుడల్లా జగిత్యాలలో మకాం వేసి పరిస్థితిని పరిశీలిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు ప్రజాక్షేత్రంలోకి పోకముందే గులాబీ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్ మెజార్టీ ఓటర్లను కలిసి అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించి, ఓటు అభ్యర్థించడం విశేషం.
గులాబీలో చేరికల జోరు.. కాంగ్రెస్, బీజేపీలు బేజారు
జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు. రెండు నెలల వ్యవధిలోనే వందల సంఖ్యలో యువకులు, మహిళలు, వివిధ కుల సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు చేరడం గమనార్హం. రాయికల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ మ్యాకల రమాదేవి, ఆమె భర్త, కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షుడు మ్యాకల రమేశ్ గులాబీగూటికి చేరారు.
అలాగే జగిత్యాలకు చెందిన మాజీ కౌన్సిలర్లు వీరబత్తిని శ్రీనివాస్, వీరబత్తిని పద్మావతి, కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు కచ్చు హరీశ్, పల్లెర్ల (డెక్కుల) రాజు, ముస్లిం మైనార్టీ జగిత్యాల శాఖ మాజీ అధ్యక్షుడు ఖాజీంఅలీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకుడు పాపున్క మహేశ్, లింగంపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బోర్నపెల్లి, చింతల్లపల్లి గ్రామాలకు రాజేశ్ యాదవ్, రాజేశం గౌడ్‌తో పాటు పలు యువజన సంఘాల నాయకులు, రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వార్డు సభ్యులు, బీజేపీకి చెందిన జ్ఞానేశ్వర్‌లతో పాటు వందలాది మంది బీఆర్ఎస్లో చేరారు. పార్టీ జోరుకు నియోజకవర్గంలోని ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్లో కలవరం నెలకొంటుంది. ఏ రోజు.. ఏ కార్యకర్త గులాబీగూటికి చేరిపోతాడోనన్న దిగులు కనిపిస్తున్నది.
ఏకమవుతున్న పల్లెలు.. జై కొడుతున్న కుల సంఘాలు..
బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్‌కు మద్దతు పెరుగుతున్నది. నియోజకవర్గంలోని కుల సంఘాలు మూక్కుమ్మడిగా జైకొడుతున్నాయి. జగిత్యాల విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం, ముదిరాజ్ కుల సంఘం, వంజరి సంఘం, పద్మశాలీ సంఘం, ముస్లిం మైనార్టీ శాఖలు, దళిత సంఘాలు మద్దతు ప్రకటించడం విశేషం. దళితబంధు, బీసీ కుల వృత్తుల ఆర్థిక సాయం, స్ట్రీట్ వెండర్స్ లాంటికి ఆర్థిక సాయం వంటి పథకాలతో కులసంఘాల సభ్యులు ప్రయోజనం పొందారు.
అలాగే జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్లో అన్ని కుల సంఘాలకు, మహిళా సంఘాలకు భవన నిర్మాణాలకు స్థలాన్ని కేటాయించడంతో కుల, మహిళ సంఘాల నాయకులు బీఆర్ఎస్కు విధేయులుగా మారిపోయారు. గతంలో ఏ ప్రభుత్వాలు కుల సంఘాల అభివృద్ధికి ఇంతగా ప్రాధాన్యతను ఇవ్వకపోవడంతో కుల సంఘాల సభ్యులు, నాయకులు మూకుమ్మడిగా గులాబీజెండాకు, డాక్టర్ సంజయ్‌కుమార్‌కు జై కొడుతున్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్, సారంగాపూర్, బీర్పూర్, జగిత్యాల రూరల్, అర్బన్ మండలాలతో పాటు, జగిత్యాల జిల్లా కేంద్రంలోను గులాబీ దళం జోష్‌ను కనబరుస్తూ గత ఎన్నిక మెజార్టీ రికార్డును తిరగరాసేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.