రాజన్న సిరిసిల్ల, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల/ముస్తాబాద్ : ‘మీ అందరి దయతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యా. తొమ్మిదిన్నరేండ్లలో సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్‌వన్‌గా నిలబెట్టిన’ అని సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణరాక ముందు ముస్తాబాద్ ఎట్లుండేదో.. ఇప్పుడు ఎట్లయిందో చూడాలని, తనను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ముస్తాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మండల కేంద్రంలో పెద్ద చెరువు మత్తడి దుంకుతున్నదని, సాగు, తాగునీరు, కరంటుకు ఇబ్బంది లేకుండా ఉందన్నారు. పదేండ్ల కింద ముస్తాబాద్‌లో కరంటుకు కటకట ఉండేదని, నాడు గ్రామాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల అనంతరం స్నానాల కోసం సెస్ అధికారులను బతిమిలాడుకోనే దుస్థితి ఉందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో నాడు కాలిపోయిన మోటర్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు ఉండేవన్నారు. రైతులు కరంటు కోసం రాత్రివేళలో పొలాల వద్దకు వెళ్లి ఎంతో మంది చనిపోయారని చెందారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పాలనే దరిద్రం
కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం మీద అవగాహన లేక మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. 10హెచ్‌పీ మోటర్లతో మూడు గంటల కరెంటు ఇస్తామని ప్రకటించడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. మూడు గంటల్లో 10హెచ్‌పీ మోటర్లతో ఎంత పొలం పారుతుందో మీరే చెప్పాలన్నారు. ముస్తాబాద్ మండలంలో ఎంత మంది రైతులు 10హెచ్‌పీ మోటర్లు వాడుతున్నారని అడుగగా, ఎవరూ లేరని అక్కడి ప్రజలు సమాధానం చెప్పారు. దీంతో అసలు కాంగ్రెసోళ్లకు రైతులు 10 హెచ్‌పీ మోటర్లు వాడుతలేరన్న విషయం కూడా తెల్వదా..? వ్యవసాయం గురించి గంత తెలుసా.. అంటూ మంత్రి ఛలోక్తి విసిరారు. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్‌రెడ్డి రైతుబంధు వద్దని, భట్టివిక్రమార్క ధరణి పోర్టల్‌ను తొలగిస్తానని, పాత పట్వారీ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తానని అనడం వారి అవివేకానికి నిదర్శనమని విమరించారు. కాంగ్రెస్ పాలనే దరిద్రమని మండిపడ్డారు. కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇవ్వడం లేదన్న కాంగ్రెస్ నాయకులు.. ముస్తాబాద్‌కు వచ్చి ఏ గ్రామంలో అయిన కరెంటు తీగలు పట్టుకోవాలని.. అప్పుడు కరెంటు ఉన్నదో లేదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు.
పదకొండు సార్లు ఛాన్స్ ఇచ్చినా ఎం చేసిన్రు?
కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి తమకు ఛాన్స్ ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారని.. వారికి ప్రజలు పదకొండు సార్లు అధికారం ఇచ్చారని గుర్తుచేశారు. యాభై ఐదేండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజలకు ఏం ఒరగబెట్టిందని, కనీసం సాగు, తాగునీరు ఇచ్చారా..? కరెంటు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి రాష్ట్ర నిధులన్నీ సిరిసిల్లకు తీసుకెళ్లి అభివృద్ధి చేస్తున్నాడని ఒక వైపు ఆరోపణ చేస్తుంటే.. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ఏమో సిరిసిల్లలో అభివృద్ధి ఏం జరిగిందంటూ ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఆ పార్టీ నాయకులే సమన్వయం లేక మాట్లాడుతూ, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. నాడు కరెంటు ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడు ఇస్తామంటూ వస్తున్నారని, వారిని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. 200 పింఛన్ సక్కగా ఇయ్యని కాంగ్రెస్ ఇప్పుడు 4వేలు ఇస్తుందంటే నమ్ముదామా..? అని ప్రశ్నించారు. కానీ, కేసీఆర్ దానిని పదిరేట్లు పెంచి 2వేలు ఇస్తున్నారని గుర్తు చేశారు.
జనవరిలో కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు
జనవరిలో అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు అందించే బాధ్యత తనదేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అత్తలకు పింఛన్లు ఇస్తున్నారని కోడండ్లు కోపంగా ఉన్నారని.. వారి కోసం మరోసారి అధికారంలోకి రాగానే సౌభాగ్యలక్ష్మి ద్వారా నెలకు 3వేల అందిస్తామని ప్రకటించారు. అత్తలకు ఆసరా పింఛన్ దశలవారీగా 5వేలు పెంచుతామని వెల్లడించారు. రైతుబంధు 10వేల నుంచి 16వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. గ్యాస్ సిలిండర్ 400కే అందిస్తామని ప్రకటించారు. తెలుపు రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం, 5లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రజలకు పాలన చేరువ చేయాలనే ఉద్దేశంతో సిరిసిల్లను జిల్లాను చేసి, కలెక్టర్, జిల్లా అధికారులతో సేవలను మరింత దగ్గర చేశామన్నారు. సిరిసిల్లలో మెడికల్ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
మీరు పెంచిన బిడ్డను ..
ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, సన్నాయినొక్కులు నొక్కితే వాటికి పడిపోకండి. ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలో పాలుపంచుకునేలా మీ తమ్ముడిగాగా మళ్లీ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అభివృద్ధే నా కులం.. సంక్షేమమే నా మతం..
అభివృద్ధే నా కులం.. సంక్షేమమే నా మతం.. అని తొమ్మిన్నరేండ్లు నికార్సుగా పని చేసిన మీ ఎమ్మెల్యేను, మీ బిడ్డను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. నా గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు, తమ్ముండ్లు, అక్కలు, చెల్లెండ్లు, బీఆర్ఎస్ సైనికులంతా బాగా కష్టపడుతున్నారని వారిని అభినందించారు. ఈ ప్రాంత రైతుల 50ఏండ్ల కల గోదావరి జలాలతో సాకారం చేశానని చెప్పారు. మల్లన్న సాగర్ ద్వారా నర్మాల ప్రాజెక్టు నింపానన్నారు. కేసీఆర్ వచ్చినంకనే వ్యవసాయం బాగుపడ్డదని, పుట్లకుపుట్లు వడ్లు దిగుబడి వస్తుందన్నారు. తరుగు తీస్తున్నారన్న చిన్నచిన్న శికాయతులున్నాయన్నారు. చంద్రుడిని చూడచ్చు.. లేదా చంద్రుడిలో ఉన్న చిన్న మచ్చను చూడొచ్చన్నారు.
ముస్తాబాద్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం
జనవరి లేదా ఫిబ్రవరిలో ముస్తాబాద్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ముస్తాబాద్‌లో 30పడకల దవాఖాన మంజూరు చేశామని, అది నిర్మాణంలో ఉందని తెలిపారు. ముస్తాబాద్‌లో జరిగిన అభివృద్ధిని మీరే చూడాలన్నారు. చెరువులు అన్ని జలకళతో ఉట్టిపడుతున్నాయని.. బడులు బాగు చేసుకున్నామని.. ముస్తాబాద్‌లోని పెద్ద బడి సర్వంగ సుందరంగా ముస్తాబవుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ సంకల్పదీక్షతో కూడవెళ్లి నుంచి గోదావరి జలాలను ముస్తాబాద్ పెద్ద చెరువులోకి తీసుకువచ్చామని, వేసవిలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నాయని తెలిపారు. మల్లన్నసాగర్ జలాలను బంధనకల్కు తీసుకువస్తామన్నారు. నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు ద్వారా చెరువులను నింపామని చెప్పారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే వ్యవసాయం బాగుపడ్డదని, పుట్లకొద్దీ వడ్లు పండుతున్నాయని వివరించారు. తొమ్మిదిన్నర ఏండ్లలో జరిగిన అభివృద్ధిని మీరే చూశారని, ఆలోచించి ఆగంకాకుండా కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
ఆలోచించి ఓటు వేయండి
ఎన్నికలు రాగానే కులం మతం పుట్టుకొస్తున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒక పార్టీ కులంతో, మరో పార్టీ మతం ప్రజల్లోకి వస్తున్నారని చెప్పారు. కులం, మతంతో కాదని.. అభివృద్ధిని చూడాలని కోరారు. జాగ్రత్తగా నవంబర్ 30న కారుగుర్తు మీద ఓటేసి మూడోసారి కేసీఆర్‌ను సీఎంగా గెలిపించాలని విజ్ఞప్తి చేశా రు. అభివృద్ధే తన కులం.. సంక్షేమమే తన మతమని వెల్లడించారు. ఎవరో సోష ల్ మీడియాలో పెట్టిన పోస్టు లు, సన్నాయినొక్కులు నొక్కితే వాటికి పడిపోవద్దని సూచించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీలో ఉన్న రాహుల్‌గాంధీకి చేరుతుందని, బీజేపీకి వేస్తే మోదీకి చేరుతుందన్నారు. కేసీఆర్‌కు తెలంగాణపై ఉన్న ప్రేమ రాహుల్ గాంధీ, మోదీ ఉంటుందా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ముస్తాబాద్ మం డల ప్రజలు తనకు ఆరు వేలకు పైగా మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ సారి గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూడాలని, మీ తమ్ముడిగాగా మళ్లీ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. నా గెలు పు కోసం కార్యకర్తలు, తమ్ముండ్లు, అక్కలు, చెల్లెండ్లు, బీఆర్ఎస్ సైనికులంతా కష్టపడుతున్నారని వారిని అభినందించారు.
అలిగినా గులిగినా.. గుద్దుడు గుద్దుడే..
కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్‌గాంధీకి.. బీజేపీకి వేస్తే నరేంద్రమోదీకి పోతుంది. ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్‌కు తెలంగాణపై ఉన్న ప్రేమలో ఈసమెత్తయిన ఢిల్లీవాళ్లకు ఉంటుందా..? మన జుట్టుపెడితే వాళ్ల చేతిలో బతుకులు ఆగమైపోతయి. అలిగినా గులిగినా మనవాళ్లనే మీదనే అలుగుతం. సమయం వచ్చే సరికి మనమంతా ఒక్కటిగానే ఉంటం. ఓట్ల రోజు గుద్దుడు గుద్దుడే ఉంటంది.
– మంత్రి కేటీఆర్
నేనే బస్సు పెడుతా.. వచ్చి తీగలు పట్టుకోండి
భట్టి విక్రమార్క 24గంటల కరెంట్ ఉండదన్నడు. నేను సవాల్ విసురుతున్న. నేనే బస్సు పెడుత. ముస్తాబాద్‌కు వచ్చి కాంగ్రెసోళ్లంతా కరెంటు తీగలు పట్టుకోవాలి. కరెంటు ఉందో లేదో తెలిసిపోతుంది. అభివృద్ధి నిరోధకులు పోతే దేశానికి దరిద్రం పోతుంది. నాడు కరెంటు ఇయ్యకుండా రైతులు, ప్రజలను గోసపెట్టిన కాంగ్రెస్ నేతలకు కరెంటు గురించి మాట్లాడేందుకు సిగ్గుశరం ఉండాలి. కరెంటు సక్కగియ్యనోడు ఆరు గ్యారంటీలు ఇస్తామంటే ప్రజలు నమ్మరు.
– మంత్రి కేటీఆర్