రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్, రైతులపై వివక్ష చూపుతున్నది. సాగునీరందించే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన రోళ్లవాగు ప్రాజెక్టుపై రెండున్నరేళ్లుగా అలసత్వం ప్రదర్శిస్తున్నది. పైగా ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యాన్ని 0.25 టీఎంసీకి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నది. వానకాలం సమీపించినా కనీసం షెటర్లు బిగించకుండా చోద్యం చూస్తున్నది. దాదాపు యాభై వేల ఎకరాలకు నీటిని అందించాల్సిన ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా మారుతుండగా, సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి మండలాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షెట్టర్లు ఎప్పుడు బిగిస్తారో తెలియక అయోమయం చెందుతున్నారు.
జగిత్యాల, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : రోళ్లవాగు ప్రాజెక్టు బీర్పూర్ అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. దీనిని నలభై ఐదేండ్ల క్రితం కొంత అభివృద్ధి చేసి, చిన్న ప్రాజెక్టుగా స్థిరీకరించారు. నీటి లభ్యత లేని వేసవి సమయంలో నీటితో నింపితే బాగుంటుందన్న ఆలోచనతో ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి డీ-53 కాలువను ఫీడర్ చానల్‌గా ఏర్పాటు చేశారు. 1989లో రోళ్లవాగును కొంత ఆధునీకరించి ప్రాజెక్టుకు రెండు స్లూయీజ్‌లు పెట్టారు. సాగు, తాగునీటి కోసం కాలువలను సారంగాపూర్, ధర్మపురి మండలాలకు తవ్వించారు.
మొత్తంగా కొంత వినియోగంలోకి తెచ్చారు. లక్ష్మీనర్సింహస్వామి ప్రాజెక్టుగా పేరు పెట్టారు. అయితే ఈ ప్రాజెక్టును మరింత ఆధునీకరించేందుకు అధికారులు అప్పుడే ప్రతిపాదనలు రూపొందించారు. ఒక్క టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యానికి పెంచితే ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాల్లోని ప్రజలకు సాగు, తాగునీరు అం దుతుందని ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చారు. అయితే, ప్రభుత్వాలు ఎప్పుడూ ఈ దిశగా దృష్టి సారించలేదు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రాజెక్టు ఆధునీకరిస్తామని రాజకీయ నాయకులు మాత్రం హామీలు ఇస్తూ వచ్చారు. గతంలో బుగ్గారం నియోజకవర్గ ప్రజలకు, తర్వాత జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ఒక ఎన్నికల హామీ మారిపోయింది.

95 శాతం పూర్తి చేసిన బీఆర్ఎస్ సర్కారు
2014లో స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత అప్పటి ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణకు కృష్టి చేశారు. ఆయన కృషి వల్ల 2017లో రూ.136 కోట్ల అంచనాలతో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టు ఆధునీకరణ పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణం, విస్తరణ కోసం రోళ్లవాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న సాగుభూమిని సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడగా, దాదాపు 200 ఎకరాలు సేకరించాలని నీటి పారుదల శాఖ అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు.
అందుకనుగుణంగా రా్రష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమిని సేకరించింది. ఎకరానికి రూ.7.50 లక్షల నష్టపరిహారం చెల్లించింది. మొత్తం రూ.16 కోట్లు వెచ్చించింది. తర్వాత ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పెంచింది. సహజ సిద్ధంగా కొండల మధ్య ఏర్పడిన ఈ ప్రాజెక్టును విస్తీర్ణాన్ని పెంచుతూ, ప్రాజెక్టు చుట్టూ కరకట్టలు నిర్మించారు. ఒక కట్టను 425 మీటర్ల పొడవు, 16 మీటర్ల ఎత్తుతో.. రెండో కట్టను 300 మీటర్ల పొడువు, రెండున్నర మీటర్ల ఎత్తుతో అటవీ ప్రాంతంలో నిర్మించారు. మూడో కట్టను 860 మీటర్ల పొడవు, 21 మీటర్ల ఎత్తుతో నిర్మించారు.
కాగా, మొత్తం కరకట్టలు ప్రాజెక్టు చుట్టూ కట్టాల్సి ఉండగా, సగం ప్రాంతం సహజ సిద్ధంగా ఏర్పడి ఉండడంతో ప్రాజెక్టుకు ప్రత్యేక శోభ వచ్చింది. ప్రాజెక్టులో 156 మీటర్ల పొడవున 16.50 మీటర్ల వెడల్పు, 12.50 మీటర్ల ఎత్తుతో మత్తడి నిర్మాణం పూర్తి చేశారు. అలాగే ప్రాజెక్టులోకి ఎస్సారెస్పీ నుంచి నీటిని తీసుకొచ్చే డీ-53 కెనాల్‌కు సైతం మరమ్మతులు చేయడంతోపాటు దాని వెడల్పును సైతం పెంచారు. అలాగే రోళ్లవాగు ప్రాజెక్టు నుంచి నీటిని బయటకు తీసుకువెళ్లే రెండు కాలువలను సైతం ఆధునీకరించారు. ప్రాజెక్టు పనులు వేగంగానే పూర్తి చేశారు. అయితే 2022 జూన్, జూలై, ఆగస్టు నెలల్లో పడిన భారీ వర్షాలకు ప్రాజెక్టు నిర్మాణ పనులకు తీవ్ర అవరోధం ఏర్పడింది. భారీ వర్షాలతో వచ్చిన వరదలకు ప్రాజెక్టులో ఇసుక, మట్టిమేటలు వేసింది. వాటన్నింటినీ తొలగించి మళ్లీ ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. కాగా, ఎస్సారెస్పీ నుంచి నీటిని డీ53 కాలువ ద్వారా లాంఛనంగా మళ్లించారు.
అనుమతుల విషయంలో సమస్యలు
రోళ్లవాగు ప్రాజెక్టు పరిధిని విస్తరించే విషయంలో భూసేకరణ కీలక అంశంగా మారింది. విస్తరణకు దాదాపు వెయ్యి ఎకరాల భూమిని సేకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో 200 ఎకరాలు పట్టా భూములు కాగా, మరో 815 ఎకరాలు రిజర్వు ఫారెస్ట్ పరిధిలో ఉండడంతో స్థల సేకరణ ఇబ్బందిగా మారింది. ప్రైవేట్ భూములకు నష్టపరిహారం ఇచ్చి సేకరించినా.. రిజర్వు ఫారెస్ట్ భూములను సేకరించడం సమస్యగా మారింది. 815 ఎకరాలకు అంతే మొత్తంలో మరో మూడు చోట్ల భూమిని గుర్తించి రిజర్వు ఫారెస్ట్‌కు అందజేసేందుకు తీర్మానించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రిజర్వు ఫారెస్ట్‌కు డీపీఆర్‌ను పంపించి, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అటవీశాఖ అనుమతులు మంజూరు కాలేదు. దీంతో ప్రాజెక్టుకు షెటర్లు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్ని సార్లు కేంద్రంతో విన్నవించినా, సానుకూల స్పందన రాలేదు. ఈ క్రమంలోనే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ 30 నెలలు గడిచినా రిజర్వు ఫారెస్ట్ నుంచి అనుమతులు సాధించలేకపోయింది.
నీళ్లు నిల్వ చేసుకోలేని స్థితి
ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా అందులో ఒక్క టీఎంసీ నీటిని నిల్వ చేసుకోలేని దుస్థితి నెలకొన్నది. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్టుకు షెటర్లు బిగించలేని పరిస్థితి ఉన్నది. దీంతో డీ-53 ఎస్సారెస్పీ కాలువ ద్వారా వస్తున్న నీరు ప్రాజెక్టుకు సంబంధించిన పాత తూము ద్వారా ఎప్పటికప్పుడు వెళ్లిపోతున్నది. అలాగే వానకాలంలో సహజ సిద్ధంగా కొండల నుంచి జాలు వారుతూ చేరే నీరు సైతం వృథాగా తూముల ద్వారా బయటకు పోతున్నది. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి రైతులకు సమయానుకూలంగా ఇవ్వలేని అధ్వాన స్థితి నెలకొంది. ప్రాజెక్టు పూర్తయి, ఎస్సారెస్పీ కాలువ ద్వారా వచ్చిన నీరు, సహజసిద్ధంగా ప్రాజెక్టులోకి వచ్చిన నీరు కండ్ల ముందు నుంచి వృథాగా వెళ్లిపోతుండడం చూసి రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. పంటలకు నీటిని వినియోగించుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు. ప్రాజెక్టు పరిధిలోని దాదాపు 18 గ్రామాల్లో సాగునీటికి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.
షెటర్ల బిగింపులో నిర్లక్ష్యం
ఎప్పటి చిప్ప ఎనుగులకే వచ్చింది అన్న సామెత లెక్కనే తయారైంది రోళ్లవాగు ప్రాజెక్టు పరిస్థితి. ఎప్పుడో నలభై ఐదేళ్ల క్రితం సర్కారు రోళ్లవాగును 0.25 టీఎంసీ సామర్థ్యానికి చేర్చింది. దానికి ఎస్సారెస్పీ కాలువ నుంచి నీరు నింపేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఒక టీఎంసీ సామర్థ్యానికి ప్రాజెక్టు చేరితే జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గంలోని వేలాది ఎకరాలకు సాగు నీరు, అలాగే అనేక గ్రామాలకు తాగునీరు అందుతుందన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ సర్కారు రూ.136 కోట్లు వెచ్చించి నిర్మించింది. అటవీశాఖ అనుమతులు సాధించడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కారు రోళ్లవాగు ప్రాజెక్టు సామర్థ్యంను మళ్లీ 0.25 టీఎంసీకే పరిమితం చేసేందుకు సిద్ధమైంది. గతంలో ఉన్న అటవీశాఖ అనుమతుల మేరకు ప్రాజెక్టులో 0.25 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ సామర్థ్యం ఉండేలా మత్తడి ఎత్తును దించివేశారు. ప్రాజెక్టులోకి 0.25 టీఎంసీ కంటే అధికంగా నీరు వస్తే అధికంగా వచ్చిన నీరు మత్తడి ద్వారా బయటకు వెళ్లే ఏర్పాట్లు చేశారు. అయితే ప్రాజెక్టుకు మూడు షెటర్లు బిగించాల్సిన పరిస్థితి ఉండగా, నెలన్నర క్రితం మూడు షెటర్లకు తయారీకి అధికారులు ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటి వరకు షెటర్లు తయారు కాలేదు. బిగింపు జరగలేదు. ప్రాజెక్టుకు షెటర్ల బిగింపు ఇప్పటి వరకు జరగకపోవడంతో ఈ వానకాలం పంటపైన సైతం రైతులు ఆశలు వదిలిపెట్టుకుంటున్నారు. ఒక్క టీఎంసీ సామర్థ్యంతో కేసీఆర్ సర్కారు ప్రాజెక్టు కడితే కనీసం పావుటీఎంసీ నీటిని సైతం కాంగ్రెస్ సర్కారు అందించడంలో విఫలమైందని మండిపడుతున్నారు. మూడు షెట్టర్లు ఎప్పుడు వస్తాయో అర్థం కావడం లేదని, ఈ వానకాలం సైతం నష్టపోయినట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గేట్లు ఏర్పాటు చేయాలి
రోళ్లవాగు ప్రాజెక్ట్‌కు ఇంతవరకు గేట్ల ఏర్పాటు చేయలేదు. ప్రాజెక్ట్‌లోకి వచ్చిన నీరంత వచ్చినట్టే వెళ్లిపోతున్నది. గతంలో రెండు పంటలకు సాగునీరు అందేది. నాకు తొమ్మిది ఎకరాలు పొలం ఉన్నది. కాలువ నీటితో పంటలు పండుతుండేవి. ప్రస్తుతం బావులపై ఆధారపడాల్సి వస్తున్నది. బావుల్లో నీరు అడుగంటితే అంతే సంగతులు. గేట్లు ఏర్పాటు చేయకపోవడంతో నీరు నిల్వ ఉండడంలేదు. పంటలకు అవసనమైనప్పుడు నీటిని విడుదల చేయడానికి అవకాశం లేదు. అధికారులు వెంటనే స్పందించాలి. కనీసం ఈ వానకాలం పంటకు సాగునీరు అందేలా చూడాలి. ప్రాజెక్ట్‌కు గేట్లు వెంటనే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి.
– సైండ్ల గంగన్న, రైతు (బీర్పూర్)
రెండు పంటలకు నీరందించాలి
నాకున్న ఐదెకరాల భూమిలో పంటలు సాగు చేస్తున్న. ఏసంగిలో మక్క వేస్తే నష్టం వచ్చింది. ప్రాజెక్ట్ నుంచి గతంలో కాలువల ద్వారా రెండు పంటలకు సాగునీరు అందేది. ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు చేపట్టి విస్తీర్ణం పెంచిన్రు. కానీ, గేట్లు పెట్టకపోవడంతో ఇబ్బందులు పడుతున్నం. నీరు ప్రాజెక్ట్‌లో ఉంటలేదు. వచ్చింది వచ్చినట్టే పోతున్నది. అధికారులు ఇగపెడుతం అగపెడుతం అంటున్నరు. వానకాలం వచ్చింది. ఇప్పటికీ గేట్లు పెట్టలేదు. వర్షాలకు వచ్చిన నీరు ఆగకుండా వెళ్లిపోతున్నది. అధికారులు వెంటనే స్పందించాలి. వానలు పడకముందే గేట్లను తొందరగా ఏర్పాటు చేయాలి. ఈయేడు వానలు తక్కువగా వస్తయంటున్నరు. గేట్లు వెంటనే ఏర్పాటు చేసి ప్రాజెక్ట్‌ను నింపాలి. రెండు పంటలకు సాగు నీరందేలా చూడాలి.
– గుండ విక్రమ్, రైతు (బీర్పూర్)