కరీంనగర్, జనవరి 6(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద ఎకరానికి ఏటా 15 వేలు ఇస్తామని చెప్పి వంచించిన కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ భగ్గుమన్నది. ఇప్పుడు ఎకరానికి 12 వేలే ఇస్తామంటూ రైతులను మోసం చేసిందని మండిపడింది. ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిచ్చింది. అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించి నిరసన తెలిపింది. రైతులకు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా పోరాడుతామని స్పష్టం చేసింది.
కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో పెద్ద ఎత్తున ధర్నా చేయగా, నగర మేయర్ వై సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుపడు జీవీ రామకృష్ణారావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, నగర పార్టీ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు. సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో అంబేద్కర్ చౌక్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రపేట చౌరస్తాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యాక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సెస్‌డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, నాయకులు గూడూరి ప్రవీణ్, ఎండీ సత్తార్, కౌన్సిలర్లు రాస్తారోకో చేశారు. తంగళ్లపల్లిలో తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి, తహసీల్దార్‌కు వినతి పత్రంఇచ్చారు. గంభీరావుపేటలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఎల్లారెడ్డిపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వీర్నపల్లి, ముస్తాబాద్, చందుర్తి, కోనరావుపేటలో నిరసనలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపారు. మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను బురదలో తొక్కి నిరసన తెలిపారు. సుల్తానాబాద్‌లో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు.
నమ్మించి నట్టేట ముంచారు
రేవంత్‌రెడ్డి రైతులను నమ్మించి నట్టేటా ముంచారు. రైతు భరోసా కోసం ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న అన్నదాతల ఆశలను ఆవిరి చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు 15 వేలు ఇచ్చేదాకా ఊరుకునే ప్రసక్తే లేదు. కొందరికే మాత్రమే 2 లక్షల రుణమాఫీ చేసి అందరికీ చేశామని చెప్పు కోవడం సిగ్గు చేటు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుపై నిజమైన ప్రేమ ఉంటే వానకాలం, యాసంగి పంటలకు ఒకేసారి 15 వేలు వారి ఖాతాలో జమచేయాలి. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ప్రకటించాలి. అరచేతిలో స్వర్గం చూపించి, కానిపోని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసలు రంగును ప్రజలు అనతి కాలంలో గుర్తించారు. అవకాశం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతారు.
– పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
రైతులను దగా చేసిన కాంగ్రెస్
రైతులను కాంగ్రెస్ నిలువునా మోసగించింది. అమలు కాని హామీలతో గద్దెనెకి, ఆచరణలో విఫలమైంది. రైతుభరోసా కింద ఎకరానికి 15 వేలు ఇస్తామని గొప్పలు చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు 12 వేలనడం సిగ్గుచేటు. రైతులను మోసం చేయడమే కాంగ్రెస్ ఎజెండా. ఇచ్చిన మాట ప్రకారం ఎకరానికి 15 వేలు ప్రతి రైతు ఖాతాలో జమ చేయాల్సిందే. లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తాం.
– హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్
పరిపాలన దృష్టి పెట్టాలి
రేవంత్‌రెడ్డి ఢిల్లీకి సంచులు మోసే పనిని పక్కన పెట్టి పరిపాలనపై దృష్టి సారిస్తే బాగుంటుంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాల పేరుతో పేపర్ల అడ్వైర్టెజ్మెంట్లకు, హెలీకాప్టర్లలో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఆ డబ్బులతో తెలంగాణ రైతులకు రైతు భరోసా, పెన్షన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. అందుకు నిలువెత్తు నిదర్శనమే రైతు భరోసా. ఎకరానికి 15 వేలతో వస్తేనే ప్రజలు జనవరి 26న శ్రీధర్‌బాబును ఆహ్వానిస్తారు. 12 వేలతో వస్తే తగిన గుణపాఠం చెప్తారు.
– మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
రుణమాఫీ చేయలేదు.. రుణం కింద వడ్ల పైసలు ఆగవట్టిన్రు
కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 6 : రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతులందరికీ రుణమాఫీ చేయకపోవడంతో.. రెక్కల కష్టాన్ని కూడా కోల్పోయే దుస్థితి వచ్చింది. అందుకు చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన రైతు చాతర్ల మల్లయ్య గోసే అద్దం పడుతున్నది. ఆయన మాటల్లోనే.. ‘సర్ నేను 2021 మే 27న మా ఊరిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంట పెట్టుబడి కోసం 85వేలు అప్పుగా తీసుకున్న. ఏటా వడ్డీ కడుతున్న. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నాకు రుణమాఫీ కాలేదు. అధికారులు, బ్యాంకోళ్ల చుట్టూ తిరిగీ తిరిగి యాష్టకొచ్చింది. 2023 డిసెంబర్లో నేను వడ్లు అమ్మితే 77545 అచ్చినయి. అవి నా బ్యాంకు ఖాతాలో పడ్డయి. కానీ, వెంటనే (అదే నెల 9న) బ్యాంకోళ్లు రుణం చెల్లింపు కింద ఆపిన్రు’ అని ఆవేదన చెందాడు. ఏడాది సంది నేను కలెక్టర్, అగ్రికల్చర్ సార్లను, ఇతర సార్లను కూడా కలిసినా ఇప్పటివరకు న్యాయం జరగలేదని వాపోయాడు. ఇప్పుడు మళ్లీ వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు చేశానని, ఇప్పటికైనా తన పైసలు తనకు ఇప్పించాలని వేడుకుంటున్నాడు.