హామీల అమలు కోసం బీఆర్ఎస్ దళం మరోసారి పోరుబాట పట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నా ఇచ్చిన 420 హామీలు అమలు చేయడం లేదని నిలదీసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాయకులు నిరసనలు తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఆయన విగ్రహాలకు వినతి పత్రాలు అందించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో కోతి రాంపూర్‌లోని గాంధీ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతోపాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు వినతిపత్రం అందించారు. మానకొండూర్‌లో మాజీ జడ్పీటీసీ సభ్యుడు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలోనూ జీవీఆర్ పాల్గొన్నారు. చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
దద్దమ్మ కాంగ్రెస్‌కు దారి చూపించు
చొప్పదండి, జనవరి 30 : ‘జాతిపిత మహాత్మాగాంధీకి శిరస్సు వంచి పాదాభివందనాలు. ఓ మహాత్మా ఈ అసమర్థ ప్రభుత్వానికి కళ్లు తెరిపించు. ఈ దద్దమ్మ కాంగ్రెస్‌కు దారి చూపించు. ఈ చేతకాని సరారుకు బుద్ధి ప్రసాదించు.. ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు.. 420 హామీలు.. 420 రోజులైనా నెరవేరక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. వాటిని నెరవేర్చేలా చూడాలి’ అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మహాత్మా గాంధీని వేడుకున్నారు. చొప్పదండిలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి, మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే హామీల అమలు విషయంలో రకరకాల సాకులతో కాలం వెల్లదీస్తున్నదని మండిపడ్డారు. కొన్ని పథకాలకు ఏవేవో కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించే ప్రక్రియ ప్రారంభించిందని, సీఎం, మంత్రులు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో 6,47,479 నూతన రేషన్ కార్డులు జారీ చేసినట్లు గుర్తు చేశారు. నిరుపేదకు రేషన్ కార్డులు రావాలనే ఆలోచనతో ఆదాయ పరిమితిని సడలించారని గ్రామీణంలో 60 వేల నుంచి 1.50 లక్షలకు, పట్టణంలో 75 వేలు నుంచి 2.50 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఒకొకరికి 6 కేజీలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. అన్నారు. ఇక్కడ మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు కళ్లు తెరిపించండి
కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 30 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 420 రోజులు అయినా ఇప్పటి వరకు అమలు చేయలేకపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వ కళ్లను తెరిపించి సద్బుద్ది ప్రసాదించాలని కోరుతూ గురువారం స్థానిక కోతిరాంపూర్‌లోని గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందించారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడారు. తమది గాంధీల పార్టీ అని చెప్పుకునే రేవంత్‌రెడ్డికి గాంధీజీ మార్గనిర్దేశనం చేయాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతే కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక ఇప్పుడు డైవర్షన్ డ్రామాలతో కాలం వెలదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశానికి వెన్నముక అయిన రైతన్నకు వెన్నుపోటు పొడిచిన ఘనత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికే దకుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలకుల తీరుతో రైతులు మరోసారి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తెలంగాణలో కనిపిస్తున్నాయన్నారు. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పాలకుల మెడలు వంచి అమలు చేసే వరకు పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. అడ్డమైన నిబంధనల పేరుతో కనీసం రేషన్‌కార్డులను కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తమ తీరు మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్‌గౌడ్, మండల అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్, బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.