ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీకి ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్నది. ఎన్నికలు ఏవైనా సరే ప్రజానీకం జైకొడుతున్నది. అందుకు నిదర్శనమే 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. ఈ రెండు ఎన్నికల మధ్య ఓటింగ్ శాతం అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్కు పెరుగగా, ప్రతిపక్షాలు పూర్తిగా డీలా పడ్డాయి. అంతేకాదు, గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి బేరీజు వేసుకుంటున్న ప్రజలు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ మెజార్టీని ఇస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాల పరిస్థితి రోజు రోజుకూ డీలా పడుతుండగా.. బీఆర్ఎస్ మాత్రం ఆత్మీయ సమ్మేళనాలతో జోరుమీదున్నది. మరోవైపు నేటి నియోజకవర్గస్థాయి మినీ ప్లీనరీలకు సిద్ధమైంది. అంటే ఒకరకంగా ఎన్నికల శంఖారావం పూరించబోతున్నది.
కరీంనగర్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యమ సమయంలోనే కాదు, ఆ తర్వాత ప్రతి సందర్భంతోపాటు ప్రతి ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లా గులాబీ పార్టీకి అండగా నిలుస్తున్నది. గ్రామ సర్పంచ్ నుంచి మొదలు జడ్పీ చైర్మన్ల వరకు, వార్డు మెంబర్ నుంచి కార్పొరేషన్ చైర్మన్ల వరకు బీఆర్ఎస్ హవానే కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2018లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా ప్రజలు బీఆర్ఎస్కు పూర్తిస్థాయిలో మద్దతుగా నిలిచి ప్రతిపక్షాలకు షాక్‌నిచ్చారు. భవిష్యత్‌లోనూ పరిణామాలు మరింత మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆరంభం కంటే.. గడిచిన ఐదేళ్లలోనే పూర్తిచేసిన అత్యధిక అభివృద్ధి పనుల ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
అవి కండ్ల ముందే కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఏర్పడిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం, శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్, ఎగువ మానేరు ఆధునీకరణ, కాళేశ్వరం నీళ్లు, మండుటెండల్లో మత్తడి దూకుతున్న చెరువులు, పెరిగిన భూగర్భ జలాలు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, ఉమ్మడి జిల్లాలో సగానికి పెరిగిన సాగునీటి విస్తీర్ణం, కేంద్రం కొర్రీలు పెడుతున్నా విజయవంతంగా ధాన్యం కొనుగోళ్లు, మిషన్ భగీరథ, విద్య, వైద్య రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఇలా విభిన్న రంగాల్లో తెలంగాణ సర్కారు తన ముద్ర వేసుకుంటూ ప్రజల ఆదరణ చూరగొంటున్నది. అంతేకాదు ఆసరా పింఛన్లు, నేతన్నకు దండుగా పథకాలతో భరోసా ఇస్తున్నది. పల్లె, పట్టణ ప్రగతితో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నది. పల్లె ప్రగతి కింద గ్రామాల స్వరూపం మార్చడంతో ఢిల్లీ స్థాయిలో అవార్డులు వరిస్తున్నాయి. ఇవన్నీ ప్రజల కండ్ల ముందే కనిపిస్తున్నాయి. అందుకే, 2018 ఎన్నికలతో పోలిస్తే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరింత గొప్ప విజయాలు సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రికార్డు స్థాయిలో ఓట్లు
ఆది నుంచీ గులాబీ పార్టీకి అండగా ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పంథాను అనుసరించింది. గత చరిత్రలో ఏ పార్టీకి రానంత స్థాయిలో ఓట్ల వర్షం కురిపించింది. 2014 ఎన్నికలతో పోలిస్తే మూడు శాతం ఓట్లు అధికంగా రావడం ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతున్నదని నిదర్శనం. ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. 2014 ఎన్నికల్లో జగిత్యాల మినహా.. మిగిలిన 12 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. అప్పటి ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి 9,88,871(48.40) శాతం ఓట్లు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 13 నియోకవర్గాల్లో 11,41,618 (51.47 శాతం) ఓట్లు వచ్చాయి. 2014తో పోలిస్తే అదనంగా 1,52,747 ఓట్లు పెరిగాయి. ఉమ్మడి జిల్లా చరిత్రలో అసెంబ్లీ కోసం జరిగిన ఏ ఏన్నికల్లోనూ ఏ పార్టీకి 47 శాతానికి మించి ఓట్లు రాలేదు. కానీ, టీఆర్ఎస్ మాత్రం 2018 ఎన్నికల్లో 51.47 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకొని రికార్డు సృష్టించింది. 2018లో ఉమ్మడి జిల్లాలో మొత్తం 22,17,710 ఓట్లు పోలు కాగా, అందులో బీఆర్ఎస్కు 11,41,618, ప్రజా కూటమికి 7,02,803, బీజేపీకి 1,40,708 ఓట్లు వచ్చాయి. కాగా, 13 నియోజకవర్గాల్లో కలిపి ఇతరులకు 2,32,581 ఓట్లు వచ్చాయి.