Sultanabad | సుల్తానాబాద్ రూరల్, జులై 6 : ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన మరుమతులకు నోచుకోలేక శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ప్రయాణం చేయడం ప్రమాదకరంగా ఉంది. వంతెన ఇలా ఉంటే ప్రయాణం ఎలా చేయడం అని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం వందలాది భారీ వాహన రాకపోకలు జరిగే ప్రధాన రహదారి వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రజలు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల పరిధిలోని డీ-86 కాల్వ వంతెన పైనుంచి సుల్తానాబాద్ నుంచి కాల్వ శ్రీరాంపూర్ మండలం నుంచి, ఓదెల మండలం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ప్రయాణికులు నిత్యం ఈ దారి నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు. కనుకుల, రేగడి మద్దికుంట, కదంబపూర్ గ్రామాల నుంచి భారీ వాహన రాకపోకలు జరుగుతుంటాయి. ఎక్కువ పరిశ్రమలు ఉండడంతో భారీ వాహన రాకపోకలు, గ్రానైట్ క్వారీల నుంచి పెద్దపెద్ద బండరాలను తరలించే లారీలు సైతం ఈ వంతెన పైనుంచి వెళ్లాల్సి ఉంటుంది.
సంబంధిత అధికారులు వంతెన మరుమతులను చేయించకపోవడంతో వంతెన సైడ్ వాల్, కింద బిచ్చలు బిచ్చలు రాలడం జరిగింది. లోపలి రాడ్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వంతెన మరమ్మతు పనులను చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.