Eelectric wire | చిగురుమామిడి, ఏప్రిల్ 7: విద్యుత్ వైరు తగిలి ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని నవాబుపేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గూళ్ళ రాజు కుమారుడు చరణ్ (9) గ్రామపంచాయతీ పక్కన క్రికెట్ ఆడుతుండగా సమీపంలోని కడారి నర్సయ్య బిల్డింగ్ పై క్రికెట్ బాలు పడడంతో తెచ్చేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు 33/11 కెవి విద్యుత్ వైరు చేతికి తగిలి షాక్ గురయ్యాడు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చరణ్ ను కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాలుడు కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యానికి ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని బాలుడు తండ్రి గూళ్ళ రాజు కన్నీరు మున్నీరుగా వినిపించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో తమ కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. బిల్డింగ్ పైన ఉన్న ప్రమాదకరమైన వైర్లను చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వాపోయాడు. జనవాసాల మధ్యలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లకు వెంటనే తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు విద్యుత్ అధికారులను కోరుతున్నారు.