శంకరపట్నం : మండల కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైకులను ఓ కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. హుజురాబాద్ వైపు నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న ఓ భారీ కంటైనర్ బ్రిడ్జి వద్దకు రాగానే అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు బైకులను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న తండ్రి షేక్ అజీమ్‌కు గాయాలవ్వగా అతని కొడుకు రెహమాన్ (9) అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మరో బైక్ పై వెళుతున్న మెట్పల్లి గ్రామానికి చెందిన ఇజిగిరి హరీష్, మాందాడి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తులకు సైతం గాయాలయ్యాయి.. క్షతగాత్రులను 108 వాహనంలో హుజురాబాద్ దవఖానకు తరలించారు. తప్పించుకొని పారిపోతున్న కంటైనర్ డ్రైవర్‌ను పోలీసులు వంకాయ గూడెం వద్ద అదుపులోకి తీసుకున్నారు.