వేములవాడ రూరల్/ చందుర్తి, డిసెంబర్ 27 : క్రిస్మస్ వేడుకల కోసం అమ్మమ్మ ఊరికి వచ్చిన బాలుడు అనుకోని రీతిలో మృత్యుఒడికి చేరాడు. ఇంటి నుంచి కిరాణాషాపునకు వెళ్లిన నిమిషాల్లోనే లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చందుర్తి మండలం మల్యాలకు చెందిన సంటి రాజు-సరిత రెండో కొడుకు సాత్విక్ (12) క్రిస్మస్ వేడుకల కోసం బుధవారం అమ్మమ్మ ఊరైన శాత్రాజుపల్లికి వచ్చాడు. అమ్మమ్మ, తాతతో పండుగ సంబురంగా జరుపుకొన్నాడు.
గురువారం ఉదయం 10గంటల తర్వాత తాత ఎడ్ల చంద్రయ్య మనుమడు సాత్విక్‌ను మల్యాలకు తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అంతలోనే పత్తి కొనేందుకు వ్యాపారి రాగా, కాంటా పెట్టిన తర్వాత వెళ్దామని చెప్పాడు. దాంతో సాత్విక్ తినుబండారం కొనేందుకు తన తాత సైకిల్‌పై కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. అంతలోనే వేములవాడ నుంచి కొండగట్టు వైపు వెళ్తున్న లారీ సాత్విక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
అయితే లారీ ఆపకుండా వెళ్లడంతో గ్రామస్తులు వెంబడించి వట్టెంల శివారులో పట్టుకున్నారు. మృతదేహాన్ని వేములవాడ ఏరియా దవాఖానకు తరలించగా, నిమిషాల వ్యవధిలోనే బాలుడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని కుటుంబసభ్యులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మరో గంటయితే తల్లిదండ్రుల వద్దకు వెళ్లేవాడంటూ రోదించారు. మృతదేహాన్ని వేములవాడ పట్టణ ఎస్ఐ రమేశ్, ట్రాఫిక్ ఎస్ఐ రాజు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.