Electricity theft | కోల్ సిటీ, జూన్ 3: గోదావరిఖని సీతానగర్ బోర్డు నుంచి కూరగాయల మార్కెట్ కు వెళ్లే దారిలో మళ్లీ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఆ మార్గంలో రోడ్డు వెడల్పులో భాగంగా ఇటీవలనే రామగుండం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు దుకాణాలను తొలగించారు. కొద్ది రోజుల పాటు స్తబ్ధతగా ఉన్నప్పటికీ రోడ్డు వెడల్పు పనుల్లో ఆలస్యం జరుగుతుండటంతో మళ్లీ ఆక్రమణలు మొదలయ్యాయి. ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఆక్రమణతోపాటు విద్యుత్ చౌర్యంకు కూడా పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ట్రాన్స్ కో నుంచి ఏలాంటి అనుమతి తీసుకోకుండానే దొంగచాటున విద్యుత్ కనెక్షన్ తీసుకొని, అక్రమంగా విద్యుత్ ను వాడుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నెల నెలల వేలల్లో అద్దెలు చెల్లించి వ్యాపారాలు చేసుకునే తాము రోడ్ల మీద ఆక్రమణల మూలంగా తమ వ్యాపారాలు సాగక ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా ట్రాన్స్ కో అధికారులు గానీ, నగర పాలక అధికారులు గాని స్పందించి ఆక్రమణలు తొలగించాలని, విద్యుత్ చౌర్యంకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.