సుల్తానాబాద్, డిసెంబర్ 5: వాహనాలకు సంబంధించి నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను సృష్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సుల్తానాబాద్ సీఐ ఇంద్రాసేనారెడ్డి తెలిపారు. సోమవారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో విలేకరులతో కేసు వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరుకోలుకు చెందిన వేముల అశిష్‌కు చెందిన టాటా ఏసీఈ మ్యాజిక్ వాహనానికి సుల్తానాబాద్ మండలం కనుకుల శివారులో ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు అశిష్ సంబంధిత పత్రాలను హెచ్డీఎఫ్సీ ఆఫీసులో అందజేశారు. అయితే ఇన్సూరెన్స్ పత్రాలు నకిలీవని హెచ్డీఎఫ్సీ ఇన్సూరెన్స్ విభాగం అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన హెచ్డీఎఫ్సీ ఏర్గో జనరల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ నంద్యాల అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. నకిలీ ఇన్సూరెన్స్ రాకెట్ డొంక లాగారు. ఓదెల మండలం శానగొండకు చెందిన గాజుల లక్ష్మన్ అనే ఆటోడ్రైవర్, వరంగల్‌కు చెందిన మ హ్మద్ షఫీగా గుర్తించి, అరెస్ట్ చేశారు. ఇద్దరూ కలి సి వారికి పరిచయం ఉన్న డ్రైవర్ల వద్ద ఇన్సూరెన్స్ చేపిస్తామని వాహనానికి రూ.3 వేలు, రూ.5 వేలు దాకా సేకరించి ఆర్సీ బుక్కులు, ఇతర పత్రాలు సృష్టిస్తున్నారని, ఇప్పటివరకు 50 నుంచి 60 మందిని మోసం చేశారని సీఐ తెలిపారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు చెప్పారు. సీఐ వెంట ఎస్సై ఉపేందర్‌రావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.