Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 10 : ఇక్కడ రోడ్డు మధ్యలో బోరు పడిందనుకుంటున్నారా..? కాదు.. కాదు. అక్కడ బోరు (చేతిపంపు) ఉండగానే రోడ్డు పడింది. కాంట్రాక్టర్ పనితీరుకు అద్దం పడుతోంది. గోదావరిఖని విఠల్ నగర్ లో ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ కాలనీలో రోడ్డు వెడల్పు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం వరకే తమ పని, చేతిపంపు తొలగించడం అధికారుల పని అనుకున్నారో ఏమో అక్కడున్న బోరింగ్ ను తొలగించకుండానే చుట్టూ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీనితో తొలుత స్థానికులు అవాక్కయ్యారు.
తర్వాత రాత్రి పూట వేగంగా వచ్చే వాహనాలకు రోడ్డు మధ్యలో ఉన్న బోరింగ్ కనిపించక ప్రమాదాలు జరిగితే ఎట్లని ఆలోచించారు. దాంతో స్థానికులే స్వయంగా నడుం బిగించి ఆ బోరింగు చుట్టూ కర్రలు, బండరాళ్లను ప్రమాద సూచికలుగా ఏర్పాటుచేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం తమకు శాపంగా పరిణమించిందని వాపోతున్నారు. పైగా బోరు నీటితో రోడ్డు చెడిపోయే పరిస్థితి ఉందని చెబుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా జరిగిన రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం అధికారులకు కనిపించడం లేదా..? లేక కాంట్రాక్టర్‌కే వంత పాడుతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులకూ పట్టింపు లేదని వాపోతున్నారు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బోరింగ్ తొలగించాలని బస్తీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.