Bommanapally villagers protest | చిగురుమామిడి, అక్టోబర్ 27: రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు బొమ్మనపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 685 లో 22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అందులో ఐకేపీ కొనుగోలు కేంద్రానికి ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని బొమ్మనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. అంతకుముందు కార్యాలయం వద్ద గ్రామస్తులందరూ కూర్చొని ఏకగ్రీవ తీర్మానం చేశారు. దశలవారీగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.
2015 లో గ్రామంలో ఐకేపీ (సెర్ఫ్) కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అప్పటినుండి ధాన్యం కొనుగోలుకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు పేర్కొన్నారు. 2022లో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి పరిస్థితి వివరించడం జరిగిందని, వెంటనే స్పందించి కలెక్టర్ తో మాట్లాడి ఆర్డీవో, డీఐలను క్షేత్రస్థాయికి వచ్చి ప్రభుత్వ భూమిని పరిశీలించినట్లు పేర్కొన్నారు.
ఆ భూమిని ఐకేపీ కేటాయించాలని తహసీల్దార్‌ను నివేదిక పంపించాలని ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు తహసీల్దార్ పట్టించుకోవడంలేదని, తన పరిధిలో లేదని ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అంశమని మాట దాటవేస్తున్నారని గ్రామస్తులు, రైతులు మండిపడ్డారు.. తహసీల్దార్ తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించని పక్షంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.