గంగాధర, నవంబర్ 18 : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకంపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ దళారుల బెడదను నివారించి, మద్దతు ధర అందించడం కోసం నాడు కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని గుర్తు చేశారు.
ప్రభుత్వమే నేరుగా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి, వారం రోజుల్లోనే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసిందన్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రైతులు ఇబ్బంది పడకుండా పకడ్బందీగా కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రభుత్వం, రైస్ మిల్లర్ల ఇబ్బందితో రైతులు ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం అమ్ముకోవడానికి మొగ్గు చూపుతున్నారని దుయ్యబట్టారు.
ప్రభుత్వ కొనుగోళు కేంద్రంలో ధాన్యం తూకం వేసే సమయంలోనే తరుగు పేరుతో బస్తాకు అదనంగా రెండున్నర కిలోలు తూకం వేస్తుందన్నారు. మిల్లులకు తరలించిన తర్వాత వెయిట్ లాస్ పేరుతో వారికి పది బస్తాల వరకు కట్ చేసి రైతులను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.