ధర్మపురి, నవంబర్ 28: ‘కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి గులాంగిరీ చేస్తరు. అక్కడోళ్లు ఏం చెబితే.. ఇక్కడ అమలు చేస్తరు. అలా ఢిల్లీకి గులాంకొట్టే నాయకులు కావాలా..? మీ ఇంటి పార్టీ అభ్యర్థిగా జనం బాగు కోసం, అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ, సుస్థిర పాలన అందించే బీఆర్ఎస్ నాయకులు కావాలా..? మీరే ఆలోచించుకోవాలని’ ధర్మపురిలో మంత్రి కొప్పు ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ధర్మపురి పట్టణంలో వీధివీధినా ప్రచారం చేసి, ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ వస్తే ఎవుసానికి మూడు గంటల కరెంటు చాలంటున్నదని, అదెట్ల సరిపోద్దో చెప్పాలని డిమాండ్ చేశారు. 24గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వమే శ్రీరామరక్ష అని వివరించారు.
ధర్మపురి క్షేత్రానికి మొక్కులు చెల్లించుకునేందుకు టూరిస్టులు వచ్చినట్లే, ఎన్నికల సమయంలో కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు వస్తున్నరని, అలాంటి టూరిస్టులను నమ్మద్దని, ఆలోచించి ఓటేయాలని సూచించారు. బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ముఖ్యంగా వ్యవసాయ రంగం బాగుపడ్డదన్నారు. రాష్ట్రంలో మూడుకోట్ల టన్నుల వడ్లు పండుతుండగా, ధర్మపురి నియోజకవర్గంలో లక్షా 30వేల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు.
పంటల సిరులు పండుతుండగా తెలంగాణ ధాన్యగారంగా మారిందన్నారు. పక్క రాష్ర్టాలను సాదే స్థాయికి ఎదిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉత్తకోతలే ఉండేటియని, బీఆర్ఎస్ పాలనలో వరికోతలు ఉంటున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో పంటలు సరిగా పండక రుణాలు, కరెంటు బిల్లులు చెల్లించలేని దుస్థితి ఉండేదని, బిల్లు కట్టకపోతే కూడా ఇంటి తలుపులు పీక్కపోయిన చరిత్ర వారిదని మండిపడ్డారు. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతుకే డబ్బులు ఇస్తున్నదని చెప్పారు. రైతు రుణమాఫీ చేస్తున్నదనీ, రైతుబీమా కూడా అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ నాడు తెలంగాణను ఆంధ్రాలో కలిపి సర్వనాశనం చేసిందన్నారు. మళ్లీ మనం రాష్ర్టాన్ని సాధించుకోవడానికి 60 ఏండ్లు గోసపడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ రాష్ర్టాన్ని 55 ఏండ్లు పాలించి చేసిందేమీ లేదని, కానీ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనే రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దిందన్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి క్షేత్రం ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదని, పదేళ్ల కిందటి వరకు ఎట్లుండెనో అందరికీ తెలుసునన్నారు. ఇప్పుడెట్ల మారిందో.. ఎంతలా అభివృద్ధి చెందిందో పోల్చిచూడాలని సూచించారు. ధర్మపురి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, అది బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ధర్మపురి మరింత అభివృద్ది కోసం మరోసారి ఆశీర్వదించాలని కోరారు. పట్టణ నడి బొడ్డున మురికి కూపంలా ఉన్న చింతామణి చెరువును రూ.1.35కోట్లతో సుందరీకరించామన్నారు. తమ్మళ్లకుంట కూడా రూ.65లక్షలతో ఆధునీకరించినట్లు వివరించారు. గోదావరిలో మురుగునీరు కలువకుండా రూ.6.50కోట్లతో మహాడ్రైనేజీ నిర్మించినట్లు చెప్పారు.
పట్టణంలో రూ.10కోట్లతో 50పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మించామన్నారు. ధర్మపురి పట్టణంలో 30 పడకల సీహెచ్‌సీని 50 పడకలుగా మార్చి వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి తెచ్చామన్నారు. ధర్మపురిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లు మంజూరయ్యాయని, సీఎం కేసీఆర్ ధర్మపురిలో పర్యటించిన సందర్భంలో మరో రూ.10కోట్లు మంజూరు చేశారని, ఆ నిధులతో అభివృద్ధి పనులు నడుస్తున్నాయన్నారు. రూ.6కోట్లతో ధర్మపురి వద్ద జాతీయరహదారిని నాలుగులైన్ల రహదారిగా సెంట్రల్ లైటింగ్‌తో విస్తరించుకున్నామన్నారు. నాలుగైదేండ్ల కింద ధర్మపురికి వచ్చిన భక్తులు ఇప్పుడొస్తే ఆశ్చర్యానికి లోనవుతున్నారని వివరించారు.
ధర్మపురిని మరింత అభివృద్ది పరుచుకోవాలంటే తనను మరోసారి గెలిపించాలని కోరారు. ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, జడ్పీటీసీ అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ సునీల్‌కుమార్, కౌన్సిలర్లు అయ్యోరి వేణు, బండారి అశోక్, పురాణపు కిరణ్మయి-సాంభమూర్తి, వొడ్నాల ఉమాలక్ష్మి-మల్లేశం, సయ్యద్ యూనుస్, అనంతుల విజయలక్ష్మి-లక్షణ్, తరాల కార్తీక్, కోఆప్షన్ సభ్యులు అలీమ్, వసంత్, ఉజ్మాతబుస్సం-షబ్బీర్, మ్యాన పద్మ, నాయకులు సంగి శేఖర్, ఇనుగంటి వెంకటేశ్వరరావ్, అక్కనపల్లి సురేందర్, వేముల నరేశ్, స్తంబంకాడి మహేశ్, గడ్డం బాలరాజు ఉన్నారు.