అక్కసుతోనే ప్రధాని అనుచిత వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి
రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
తెలంగాణచౌక్‌లో మోదీ దిష్టిబొమ్మ దహనం
హాజరైన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, మేయర్ సునీల్‌రావు
కార్పొరేషన్, ఫిబ్రవరి 9: తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక పార్లమెంట్ వేదికగా అబద్ధాలు చెప్పిన ప్రధాని మోదీ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ రాష్ర్టాన్ని హేళన చేసేలా మాట్లాడడం విడ్డూరమన్నారు. అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాల్సిన ఆయన తెలంగాణపై విషం చిమ్మడం తగదని ఆక్షేపించారు. ‘మోదీకో హఠావో.. తెలంగాణకో బచావో’ అంటూ పిలుపునిచ్చారు. ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం మంత్రి నేతృత్వంలో టీఆర్ఎస్ నాయకులు కరీంనగర్ జిల్లాకేంద్రంలోని మార్క్‌ఫెడ్ గ్రౌండ్ నుంచి తెలంగాణచౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ తీశారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై సంప్రదింపులు జరుగలేదని చెప్పిన ప్రధాని.. ఎవరిని సంప్రదించి నోట్ల రద్దు చేశారని, సీఐఏ ఆర్డినెన్స్ తెచ్చారని ప్రశ్నించారు. 70 ఏండ్ల తెలంగాణ పోరాటం, వేలాదిమంది అమరుల బలిదానాలు మోదీకి కనిపించకపోవడం బాధాకరమన్నారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన ఆయన ఇక్కడి అభివృద్ధిని చూసి కన్నుకుట్టే అక్కసు వెల్లగక్కారని దుయ్యబట్టారు. తన సొంత రాష్ట్రం గుజరాత్ సైతం అభివృద్ధి సాధించలేదనే ఈర్ష్యతోనే విషం గక్కుతున్నారని మండిపడ్డారు.
ఆంధ్రా, తెలంగాణను కలిపే ప్రయత్నం చేస్తున్నారా? అని నిలదీశారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన బీజేపీ ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయాలని, వారిని తిరిగి పువ్వుల్లో పెట్టుకొని గెలిపించుకుంటామన్నారు. లేదంటే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. తెలంగాణ గడ్డ ప్రధాని మోదీని ఎప్పటికీ క్షమించదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్-3 ద్వారా తెలంగాణ ఏర్పడ్డదని, ఇప్పుడు మోదీ తప్పుబట్టడం చూస్తుంటే ఆ మహనీయుడిని కించపరిచినట్టేనని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, మేయర్ వై సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.