Cpm veeraiah | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 25 : జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ మతతత్వ దాడిగా చిత్రీకరిస్తుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య ఆరోపించారు. నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవరెడ్డితో కలిసి ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తరువాత దేశంలో ఉగ్రవాదాన్ని అంతమొద్దించినట్లు ప్రగల్బాలు పలికిందని ఎద్దేవా చేశారు. మరి కాశ్మీర్లో ఉగ్రవాదులు ఎలా దాడులు చేశారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే నిఘా సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైనాయని ఆరోపించారు. దేశంలో మతరసామరస్యాన్ని పెంపొందించాల్సిన కేంద్ర ప్రభుత్వం కాశ్మీరు దాడులను ఒక వర్గం పైనే జరిగినట్లు గా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. దాడులలో పర్యాటకులను కాపాడే క్రమంలో ముస్లిం యువకుడు కూడా ఉగ్రవాదుల తూటాలకు బలి అయ్యాడని పేర్కొన్నారు.
దేశంలో మతవిద్వేషాలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కుటిల యత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఉగ్రవాదుల దాడిపై సమగ్ర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలని, రైతులకు రుణమాఫీ, పంట బీమాతో పాటు పండించిన అన్ని రకాల వడ్లకు బోనస్ అందించాలని, డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న కనీస వేతన సవరణ జీవను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ కాలయాపనతో కోటి యాభై లక్షల మంది కార్మికులు నష్టపోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నగర కార్యదర్శి సత్యం కార్యవర్గ సభ్యులు ముకుంద రెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, ఎడ్ల రమేష్, నరేష్ పటేల్ పాల్గొన్నారు.