mla adluri | ధర్మారం, ఏప్రిల్ 10: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి పెట్రోల్, సిలిండర్ గ్యాస్ ధరలు పెంచి మోసం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. ధర్మారం మండల కేంద్రంలోని జక్కన్నపల్లి వద్ద ఉన్న ఎస్టీ బాలికల మినీ గురుకుల పాఠశాలలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన డైనింగ్ హాల్ ను ఆయన గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను వంచిస్తూ పాలన చేస్తుందని ఆయన మండిపడ్డారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మళ్లీ పేద ప్రజలపై భారం మోపేందుకు పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచిందని ఆయన ధ్వజమెత్తారు. అదేవిధంగా గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచి సామాన్యుడి నడ్డి విడిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేసారి పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల పేద ప్రజలపై పెను భారం పడిందని వాపోయారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తూ అభివృద్ధికి ఆటంకంగా మారిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆఖరి ముఖ్యమంత్రి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలో తేల్చేది బీజేపీ కాదని, ప్రజల నిర్ణయం అనే విషయాన్ని బండి సంజయ్ గుర్తుంచుకోవాలని లక్ష్మణ్ కుమార్ హితవు పలికారు.