సద్దులకు వేళయింది.. నేటి పెద్ద బతుకమ్మ సంబురాలకు ఊరూవాడా ముస్తాబైంది.. ఎనిమిది రోజులపాటు ఆటపాటలతో హోరెత్తిన వేడుక, గురువారం అంబరాన్నంటనున్నది.. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ఆడిపాడేందుకు మహిళలు సిద్ధం కాగా, ఊరూరా సందడి నెలకొన్నది.
కార్పొరేషన్, అక్టోబర్ 9 : బతుకమ్మ సంబురం ఈనెల 2న ఎంగిలిపూలతో మొదలైంది. అప్పటి నుంచి ప్రతి రోజూ ఆడబిడ్డల ఆటపాటలతో వీధివీధీ హోరెత్తుత్తున్నది. నేడు సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకొనేందుకు మహిళలు సిద్ధమయ్యారు. ఇప్పటికే పూలను తెచ్చి ఇళ్లలో భద్రపరిచారు. గురువారం ఉదయం నుంచే బతుకమ్మలను పేర్చి, సాయంత్రం కూడళ్ల వద్ద ఆడిపాడి, జలవనరుల్లో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత వాయినాలు ఇచ్చిపుచ్చుకొని సత్తుపిండి పంచుకుంటారు. ఇటు వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చెరువులు, కుంటలు, కాలువల వద్ద లైటింగ్ సిద్ధం చేశారు.
Karimnagar4
పూలవనంలా మార్కెట్లు
సద్ద్దుల బతుకమ్మ సందర్భంగా ఉమ్మడిజిల్లాలోని ప్రధాన మార్కెట్లు బిజీగా మారాయి. అటు అమ్మకందారులు, ఇటు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. రెండు రోజుల నుంచే పూలు అమ్మే వారితో కరీంనగర్ మార్కెట్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. బుధవారం అయితే ఇసుకేస్తే రాలనంతగా జనం రాగా, మార్కెట్ రోడ్డు, టవర్ సర్కిల్, తెలంగాణ తల్లి చౌరస్తా రోడ్లన్నీ రద్దీగా కనిపించాయి. ముందస్తుగానే ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మూడు రోజుల నుంచే మార్కెట్ వైపు వన్‌వే ఏర్పాటు చేశారు.
స్వల్పంగా పెరిగిన ధరలు
బతుకమ్మకు అవసరమయ్యే అన్ని రకాల పూల ధరలు గతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. సిద్దిపేట, వరంగల్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, జనగాం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో పూలను తీసుకవచ్చి విక్రయిస్తున్నారు. పట్టుకుచ్చులు పరిమాణం బట్టి మూడు కట్టలకు 50 వరకు, గునుగు పరిమాణం బట్టి కట్టకు 10 నుంచి 20 వరకు, తంగేడు 10 నుంచి 50 వరకు, బంతిపూలు కిలో 100 వరకు అమ్ముతున్నారు.