మల్యాల(కొడిమ్యాల), ఫిబ్రవరి 27: బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నవి స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు కాదని, జనంలేక వెలవెలబోతూ అవి పాప్‌కార్న్ మీటింగ్లుగా మారాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సాధిస్తామనే ధీమా బీజేపీ నాయకుల్లో ఉందని, కానీ తెలంగాణ ప్రజలు వారికి ఓటుతోనే గుణపాఠం చెప్పి సీఎం కేసీఆర్‌కు మళ్లీ పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం కొడిమ్యాల మండలంలోని రామకిష్టాపూర్లో సీసీ రోడ్లు, కొండాపూర్‌లో గ్రామ పంచాయతీ భవనం, పల్లెవైద్య ఆరోగ్య కేంద్రం, సీసీ రోడ్ల నిర్మాణం, మహిళా సంఘ భవనం, అంబేద్కర్ సంఘ భవన నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడిమ్యాల మండలంలోని కొండాపూర్ గ్రామంలో రూ. కోటితో ఏకకాలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, ఈ పనులన్నీ త్వరలోనే పూర్తయి ప్రజలకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే గ్రామపంచాయతీల రూపురేఖలు మారాయని, పల్లెప్రగతి కార్యక్రమంతో గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సాధ్యమవుతున్నదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తానూ రూ. 550 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టానని, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్‌కుమార్ చొప్పదండి నియోజకవర్గం కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టారో వెల్లడించాలన్నారు. కొండాపూర్‌లో ఇటీవల మృతి చెందిన రైతులు కందుల రమేశ్ రెడ్డి, నరకట్ల దేవరాజం, బైరి నర్సయ్య కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల రైతుబీమా ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ ప్రశాంతి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కృష్ణారావు, సహకార సంఘం అధ్యక్షుడు రాజనర్సింగరావు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వెంకటేశ్, సర్పంచులు గుంటి లక్ష్మీదేవి, సామంతుల ప్రభాకర్, తహసీల్దార్ స్వర్ణలత, ఏవో అనూష, వైద్యాధికారి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.