Bhu Bharati | పెద్దపల్లి, జూన్ 20: ఆగస్టు 15 నాటికి భూ భారతి దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తహసీల్దార్లకు సూచించారు. కలెక్టరేట్లో భూ భారతి చట్టం అమలుపై అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్టర్ రెవెన్యూ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులలో దాదాపు15 వేల వరకు వివిధ భూ సమస్యల పై దరఖాస్తులు వచ్చాయని, వీటిలో సాధా బైనామా దరఖాస్తులను పక్కన పెడితే 10 వేల దరఖాస్తులు ఉంటాయని వెల్లడించారు.
ప్రతి దరఖాస్తు పరిష్కారానికి మండలంలో తహసీల్దార్ బాధ్యత వహిస్తూ, మానవతా దృక్పథంతో పని చేయాలని, అనవసరంగా దరఖాస్తులను తిరస్కరించవద్దని సూచించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు జర్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పెద్దపల్లి, మంథని ఆర్డీవోలు బీ గంగయ్య, కే సురేష్, ఏవో శ్రీనివాస్ , కలెక్టరేట్ సూపరింటెండెంట్ బండి ప్రకాశ్, తహసీల్దార్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.