Dharmaram | ధర్మారం, నవంబర్ 22: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయంలో భిక్షా కార్యక్రమం ప్రారంభమైంది. అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించి ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తైంది. దీంతో ఇక్కడ ఈసారి ఆలయంలో అయ్యప్ప స్వామి వారి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతీ ఏటా మాదిరిగానే ఈసారి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి వారి (మాలలు) దీక్షలు చేపట్టారు.
ఈ క్రమంలో దీక్ష స్వాముల కోసం ఆలయ ఆవరణలో ఏటా నిర్వహిస్తున్న మాదిరిగానే వారికోసం (భిక్షా) భోజనం సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ వ్యవస్థాపకుడు తాటిపల్లి ఈశ్వర్ శనివారం ప్రారంభించారు. జనవరి 5వరకు భిక్షా కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆలయ ప్రధాన పూజారి నర్సింగారావు గురుస్వామి నేతృత్వంలో ప్రారంభమైన అయ్యప్ప భిక్షా కార్యక్రమానికి తొలి రోజు అయ్యప్ప దీక్షాపరులతో పాటు అయ్యప్ప భక్తులు సుమారు 100 మంది పాల్గొన్నారు. ప్రతీరోజు భిక్షా కార్యక్రమం కొనసాగుతుందని, అయ్యప్ప స్వాములు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు తాటిపల్లి ఈశ్వర్ గురుస్వామి విజ్ఞప్తి చేశారు.