ఇల్లంతకుంట, అక్టోబర్28: భారతీయ జన తా పార్టీ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించింది.. నమ్మివచ్చిన విద్యార్థి నాయకులను నడిరోడ్డుపై వదిలేసింది.. అని ప్రజా గాయకుడు దరువు ఎల్లన్న ఆరోపించారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని వైశ్యభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థి ఉద్యమ నాయకులకు చట్టసభల్లో అవకాశం కల్పిస్తామని చెప్పిన బీజేపీ, ప్రస్తుతం ఎన్నికల సమయంలో పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. నమ్మివచ్చిన విద్యార్థి నాయకులను నట్టేట ముంచిందన్నారు. బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర, నిరుద్యోగ మార్చి వంటి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో తాము కీలకంగా పని చేశామన్నారు. బీజేపీలో నమ్మకంగా పని చేసిన కార్యకర్తలను గుర్తింపు లేదన్నా రు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసి, ప్రజల్లో తనకంటూ ఒక స్థానం కల్పించుకున్న తర్వాత, ఎన్నికల సమయం రాగానే పక్కనపెట్టేశారని మండిపడ్డారు. సరైన గుర్తింపు లేకపోవడంతో బీజేపీకి తనతోపాటు ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాలకు చెందిన 22మంది కీలక నాయకులు రాజీనామా చేశారని తెలిపారు.
బీజేపీకి రాజీనామా చేసిన ప్రజా గాయకుడు దరువు ఎల్లన్నను కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు శనివారం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సాధారంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నరసింహారెడ్డి, పెద్దలింగాపూర్ సర్పంచ్ గొడిసెల జితేందర్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
గంగాధర, అక్టోబర్ 28: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సుంకె రవివంకర్ను వెంకంపల్లి సర్పంచ్ ముక్కెర మల్లేశం శనివారం కరీంనగర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని పురాతన పుణ్యక్షేత్రం రామలింగేశ్వర స్వామి ఆలయ చిత్రపటాన్ని మంత్రికి అందజేశారు.
చొప్పదండి, అక్టోబర్ 28: చొప్పదండి పట్టణంలోని జ్ఞాన సరస్వతీ ఆలయంలో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. శనివారం చంద్రగ్రహణం ఉండడంతో పల్లకీ సేవ మధ్యాహ్నం నిర్వహించారు. అశేష భక్త జన సంద్రంలో జ్ఞాన సరస్వతీ లక్ష్మీదేవి లలితా దేవీని కొనియాడుతూ భక్తులు పల్లకీ సేవలో తరించారు. ఆలయ ప్రధాన అర్చకులు సింహాచలం జగన్మోహన్ స్వామి. శ్రీ భాష్యం నవ్య కుమార్, అర్చకుడు దీకొండ అభిరామ్ శర్మ భక్తులకు పూజల అనంతరం ఆశీర్వచనాలను అందజేశారు.