దార్: సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. మధ్యప్రదేశ్‌లోని దార్ జిల్లాలో ఉన్న భోజ్‌శాల-కమల్ మౌలా మసీదులో హిందువులు, ముస్లింలు కలిసి పూజలు, ప్రార్థనలు చేసుకోవచ్చు అని పేర్కొన్నది. శుక్రవారం వసంత పంచమి(Basant Panchami) సందర్భంగా ఇవాళ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. వసంత పంచమి రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు హిందువులు పూజలు చేసుకోవచ్చు అని, అలాగే ఆ రోజున మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చు అని సుప్రీం పేర్కొన్నది. అయితే నమాజ్‌కు వచ్చే ముస్లింలు జిల్లా యాజమాన్యం వద్ద తమ పేర్లను నమోదు చేయాల్సి ఉంటుందని కోర్టు ఆదేశించింది.
వసంత పంచమి సందర్భంగా శుక్రవారం భోజ్‌శాలలో సరస్వతీదేవి పూజ నిర్వహించనున్నారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, విపుల్ పాంచోలితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. రెండు వర్గాల ప్రజలు ఒకరికి ఒకరు సహకరించుకోవాలని, అలాగే రాష్ట్ర, జిల్లా ప్రభుత్వ యాజమాన్యానికి సహకరించాలని కోర్టు పేర్కొన్నది. వసంత పంచమి సందర్భంగా దార్లో సుమారు 8 వేల మంది పోలీసుల్ని మోహరించారు. అవాంఛిత సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు.
విష్ణు శంకర్ జైన్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. 2003లోనే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ముస్లింల ప్రార్థనల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. శుక్రవారం రోజున మధ్యాహ్నం 1 నుంచి 3 మధ్య ప్రార్థనలు చేసుకోవడానికి వీలు కల్పించింది. వసంత పంచమి రోజున హిందువులు పూజలు చేసుకోవచ్చు అని, మంగళవారం కూడా పూర్తి స్థాయిలో పూజలు చేసుకునేందుకు ఏఎస్ఐ అనుమతి ఇచ్చింది. అయితే ఆనాటి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు మాత్రమే వసంత పంచమి-శుక్రవారం కలిసి వచ్చాయని, 2006..2013.. 2016 సంవత్సరాల్లో ఇలాంటి సందర్భం ఎదురైంది.