Mana Shankara Vara Prasad Garu | మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘మన శంకరవరప్రసాద్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 300 కోట్ల క్లబ్లో చేరి ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకుపోతోంది. అయితే ఈ క్రమంలోనే చిత్రబృందం ప్రేక్షకులకు మరో గుడ్ న్యూస్ అందించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని రోజులు పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉండగా నేటినుంచి రెగ్యులర్ ధరకే టికెట్లు లభించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
సంక్రాంతి పండుగా కానుకగా ఈ సినిమా టికెట్ రేట్లను పది రోజులు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులను జారీ చేశాయి. అయితే ఈ పది రోజులు పూర్తి అవ్వడంతో తాజాగా మెజారిటీ థియేటర్లలో టికెట్ ధరలు మళ్లీ సాధారణ స్థాయికి చేరుకున్నాయి.
ప్రస్తుతం సాధారణ ధరలకే టికెట్లు విక్రయిస్తుండటంతో సామాన్య ప్రేక్షకులు మరియు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు భారీగా క్యూ కడుతున్నారు. చిరంజీవి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కు తోడు, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించడం, నయనతార కథానాయికగా మెరవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జాతీయ భద్రతా అధికారిగా చిరంజీవి నటన, యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అన్ని ప్రముఖ బుకింగ్ యాప్స్ మరియు థియేటర్ కౌంటర్లలో సామాన్యులకు అందుబాటు ధరల్లోనే టికెట్లు లభిస్తున్నాయి. మరోవైపు, టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇటీవల సీరియస్ అయ్యింది, భవిష్యత్తులో ఇలాంటి పెంపుదలలకు 90 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని కొత్త మార్గదర్శకాలను సూచించింది.