విద్యానగర్ జులై 29.. ఎడతెరిపిలేని వర్షాలతో పరిసరాల్లో పరిశుభ్రత లోపించడం, తాగునీరు కలుషితం కావడం వల్ల వివిధ రకాల వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉన్నది. సీజనల్ వ్యాధుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు సూచిస్తున్నారు. అందులో భాగంగా అన్ని పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి శుక్రవారం డ్రైడే అమలు చేయాలని స్పష్టం చేస్తున్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, డ్రైనేజీల శుభ్రత, దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎప్పటికప్పుడు సిబ్బందిని ఆదేశిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ డెంగ్యూ కేసులు పదుల సంఖ్యలో వస్తుండడంతో యాంటీ లార్వా కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేసింది. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులకు ఆదిలోనే అడ్డుకట్టు వేసేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించింది.
ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించి, జ్వరం, జలుబు, తలనొప్పి, తదితర లక్షణాలు ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. వీటినిబట్టి నేరుగా ఇంటి వద్దే ఉచితంగా మందులు అందిస్తున్నారు. జ్వరం, జలుబు, తలనొప్పి లక్షణాలు మూడు నాలుగు రోజులైనా తగ్గకపోతే రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తున్నారు. డెంగ్యూ మలేరియా నిర్ధారణ అయితే ప్లేట్లెట్స్ తగ్గకుండా ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. డెంగ్యూ కేసులు నమోదైతే పరిసర ప్రాంతాల్లోని ఇండ్లల్లో ప్రత్యేక సర్వే చేపట్టి రక్త నమూనాలను సేకరించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
వర్షాల వల్ల నీటి కాలుష్యం పెరుగుతుండడంతోపాటు కొన్నిచోట్ల డ్రైనేజీ నీరు తాగునీటి పైపుల్లోకి చేరుతోంది. ఇవి తాగితే డయేరియా, కామెర్లు వచ్చే ప్రమాదం ఉన్నది. దీని నివారణకు కాచి, చల్లార్చిన నీటిని తీసుకోవాలి. నిల్వ ఉన్న వర్షపు నీరు, మురుగునీటితో దోమలు వ్యాప్తి చెందుతాయి. వీటి నివారణకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా చూ డాలి. తినే ముందు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. వేడి వేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. ఆహార పదార్థాలపై మూతలు సరిగ్గా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లల్లో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.