Godavarikhani | కోల్ సిటీ , మార్చి 16 : రామగుండం నగర పాలక సంస్థ 36వ డివిజన్ గాంధీనగర్లో గల గాంధీ పార్క్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ చేయూతనందించింది. ఈమేరకు సోమవారం పాఠశాలకు రూ.70వేల విలువ గల ఐదు కంప్యూటర్లు, నాలుగు సీసీ కెమెరాలను సమకూర్చింది. నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి ముఖ్యతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి సీసీ కెమెరాలను, ప్లే ఏరియాను లాంఛనంగా ప్రారంభించారు. డెస్క్ టాప్ కంప్యూటర్లను ఉపాధ్యాయులకు అందజేసి మాట్లాడారు.
తాను కూడా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యాభ్యాసం వరకు ప్రభుత్వ విద్యా సంస్థలోనే చదివానని, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. కాగా పాఠశాల విద్యార్థుల భవిష్యత్ కోసం కంప్యూటర్లు అందజేసిన స్వచ్ఛంద సంస్థ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వల పద్మావతి రంజిత్, మండల విద్యాధికారి జింక మల్లేశం, బెస్ట్ రన్నర్స్ సంస్థ ప్రతినిధి కోలేటి సతీష్, ఇతర కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు విజయశాంతి, సంపత్, స్వరూప్ చంద్, రమేష్, రవి, సంగీత, రమాదేవి. గోదాదేవి తదితరులు పాల్గొన్నారు.