ఇప్పటికే అనేక వరుస అవార్డులు దక్కించుకుని రికార్డులు సృష్టించిన కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, మరోసారి జాతీయ స్థాయిలో అత్యుత్తమ గుర్తింపు సాధించింది. దేశంలోని 355 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో ఈ దశాబ్దపు ఉత్తమ బ్యాంకుగా ఎంపికైంది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన గ్రామీణ సహకార బ్యాంకుల సమావేశంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రదానం చేసిన ఈ అవార్డును కేడీసీసీబీ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బ్యాంకు ముఖ్యకార్య నిర్వహణాధికారి ఎన్ సత్యనారాయణరావు అందుకున్నారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖ్యాతి జాతీయ స్థాయిలో మరోసారి మార్మోగింది.
కరీంనగర్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : సహకార ఉద్యమం, రైతాంగానికి సేవలు అందించడమే పరమావధిగా 1904లో స్థాపించిన కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇటీవలే శత వసంతోత్సవాలు జరుపుకున్నది. ఎన్నో ఒడిదొడుకులను ఓర్చిన ఈ బ్యాంకు గత దశాబ్ద కాలం వరకు కష్టాల కడలిలో కొట్టు మిట్టాడుతూ ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన కొండూరు రవీందర్రావు తన దార్శనికత, నిబద్దత, సృజనాత్మకత, నాయకత్వ పటిమతో బ్యాంకు వ్యాపార సరళిని మార్చేశారు. సేవలను విస్తృత పరిచి దేశంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులన్నింటిలో అగ్రగామిగా నిలిపారు. ఇందుకు పాలకవర్గ సహకారం ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్ సత్యనారాయణరావు దీక్షా దక్షతలు, నిపుణులైన సిబ్బందితో సేవలు అందిస్తూ గత దశాబ్ధ కాలంలో ముంబైలోని నాఫ్స్కాబ్ ద్వారా అత్యుత్తమ బ్యాం కుగా గుర్తింపు పొందింది. తాజాగా, దేశంలోనే ఈ దశాబ్దపు ఉత్తమ బ్యాంకుగా ఖ్యాతి సాధించింది.
నష్టాల ఊబి నుంచి లాభాల బాట
కేడీసీసీబీ ఒకప్పుడు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నది. తీవ్రమైన నష్టాల ఊబిలో కూరుకుపోయింది. 2005-06 ఆర్థిక సంవత్సరం వరకు రూ.57.92 కోట్ల సంచిత నష్టాల్లో ఉండగా, 2012-13 నుంచి లాభాల బాటలో పయనిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చిన్న సన్నకారు రైతులకు అన్ని రకాల ఆర్థిక అవసరాలు తీరుస్తూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఆర్థిక, ఇతర సేవలను అందిస్తూ గ్రామీణ ప్రజలకు కామధేనువుగా మారింది. ప్రజాస్వామ్య స్ఫూర్తితో పాలకవర్గం రూపొందించే మార్గదర్శకాలు, వివిధ విషయాల కోసం ఏర్పడిన ప్రత్యేక సబ్ కమిటీలు, వాటి నిర్ణయాలు, తద్వారా చేపట్టే అన్ని రకాల సేవలు అందిస్తూ జిల్లాలోని గ్రామీణులకు కొంగు బంగారమైంది. 1,207 గ్రామాల్లోని 7.68 లక్షల ఖాతాదారుల ఆర్థిక పరిపుష్టికి, వారి మేలైన జీవన విధానానికి తోడ్పాటును అందిస్తోంది. ప్రజల ఆర్థిక అవసరాలను గుర్తించి వారికి అనువైన రుణ సౌకర్యాలు చాలా సరళీకృత పద్ధతిలో అందిస్తున్నది.
2012లో కేవలం 29 శాఖలుగా ఉన్న బ్యాకు ప్రస్తుతం 65 శాఖలకు విస్తరించింది. అప్పటి వాటా ధనం రూ.62 కోట్ల నుంచి ప్రస్తుతం రూ.346 కోట్లకు పెరిగింది. 2012లో రూ.271.30 కోట్ల డిపాజిట్లు ఉండగా ప్రస్తుతం రూ.2,263.68 కోట్లకు వృద్ధి చెందింది. అప్పుడు బ్యాంకు మంజూరు చేసిన రుణాలు రూ.466.51 కోట్లు మాత్రమే కాగా, ప్రస్తుతం రూ.2,636.43 కోట్లకు పెరిగింది. 165 నుంచి 483 వరకు బ్యాంక్ సిబ్బంది పెరిగారు. ఉద్యోగి సగటు వ్యాపారం రూ.4.47 కోట్ల నుంచి రూ.10.14 కోట్లకు పెరిగింది. సగటున ఒక్కో శాఖ వ్యాపారం చూస్తే రూ.25.44 కోట్ల నుంచి రూ.73.14 కోట్లకు చేరి ఇతోధిక అభివృద్ధిని నమోదు చేసుకుంది. 2.40 శాతంగా ఉన్న నిరర్థక ఆస్తులు 1.42 శాతానికి తగ్గి నికర నిరర్ధక ఆస్తులు సున్నాగా నమోదయ్యాయి. 2011-12 ఆర్థిక సంవత్సరం నాటికి నికర నష్టం రూ.563.43 లక్షలు కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి లాభం రూ.2,142.38 లక్షలు ఆర్జించింది.
దశాబ్ద కాలంలో జరిగిన పురోగతి
దూరదృష్టి, నిబద్దత, దక్షత కలిగిన పాలకవర్గం, రాజకీయ క్రినీడలకు తావివ్వని విధాన నిర్ణయాలు, పారదర్శక పనితీరు, వృత్తి నైపుణ్యం కలిగిన అత్యంత అంకిత భావం కలిగిన ముఖ్య కార్యనిర్వహణాధికారి, నైపుణ్యంగల సిబ్బందితోపాటు బ్యాం కు శాఖల విస్తరణ, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు, నిపుణులైన సిబ్బందితో బ్యాంకుల కంప్యూటరీకరణ, అంతర్గత ఆడిట్ వ్యవస్థ, నిర్ధిష్టమైన పర్యవేక్షణ, తనిఖీలు, బ్యాంకుల సేవల్లో విశధీకరణ, సంఘాల ద్వారానే కాకుండా నేరుగా బ్యాంకు శాఖల ద్వారా వినియోగదారులకు వాణిజ్య బ్యాంకులు అందించే ఆర్థిక, వ్యవసాయ, వ్యవసాయేతర సేవలు అందించడం, బ్యాంకు మూలాలైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పటిష్టతకు చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా సంఘాల అభివృద్ధి స్థాయి పెంచడం,
బ్యాంకు సేవలను తెలిపే 14 ఆర్థిక అక్షరాస్యతా కేంద్రాలను స్థాపించడం, సంఘాల కంప్యూటరీకరణ, బాగా పనిచేసే సంఘాలకు ప్రోత్సాహకాలు అందించడం, బ్యాంకు సభ్యులకు డివిడెంట్ చెల్లించడం వంటి కార్యక్రమాలతో దశాబ్దంలో దేశంలోనే ఉత్తమ బ్యాంకుగా కేడీసీసీబీ గుర్తింపు పొందింది.
ప్రత్యేక సేవల్లో గుర్తింపు
దేశంలోని ఏ బ్యాంకూ చేపట్టని, నిర్వహించని రెం డు ప్రత్యేక ప్రాజెక్టులను కేడీసీసీబీ నిర్వహిస్తున్నది. రూ.2 కోట్లతో సమీకృత వ్యవసాయ విధానం, రూ.3.55 కోట్ల గ్రాంటుతో నిర్వహిస్తున్న వాటర్ షెడ్ ప్రాజెక్టు ఉన్నాయి. 82 ప్రాథమిక వ్యవసాయ సంఘాలు వ్యవసాయేతర రుణ, రుణేతర సేవలు అందిస్తూ బహుళార్థ సేవా కేంద్రాలుగా మారి ఇతోధిక లాభాలు ఆర్జిస్తున్నాయి. ఫలితంగా ఆర్థికంగా పరిపుష్టిగా మారుతున్నాయి. పెట్రోల్ బంకుల నిర్వహణ, రైస్ మిల్లులు, బియ్యం విక్రయ కేంద్రాలు, సూపర్ మార్కెట్లు, దుకాణ సముదాయాలు, ఫంక్షన్ హాల్స్, గోదాములు, విత్తన శుద్ధి కర్మాగారాలు, శుద్ధజల విక్రయ కేంద్రాలు, లాకర్లు వంటి సేవలే కాకుండా బంగారు ఆభరణాల హామీపై రుణాలు, వాహన కొనుగోలు, గృహ నిర్మాణం, ఉన్నత విద్య, వ్యాపార అభివృద్ధి వంటి వ్యవసాయేతర రుణాలను బ్యాంకు అందిస్తోంది.
సహకారానికి అవార్డుల పంట
కేడీసీసీబీ విశేష సేవలు దేశ విదేశాల్లో కరీంనగర్‌కు ఖ్యాతి తెచ్చిపెట్టాయి. ఈ బ్యాంకు పనితీరును అధ్యయనం చేసేందుకు ఆయా దేశాల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి సైతం ప్రభుత్వ ప్రతినిధులు కోకొల్లలుగా వస్తున్నారు. ఈ బ్యాంకు సేవలను గుర్తించిన ముంబైలోని నాఫ్స్కాబ్ 2015-16 నుంచి 2019-20 వరకు వరుసగా ఐదేళ్లు దేశంలోనే అత్యుత్తమ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుగా గుర్తింపునిచ్చి అవార్డులు అందజేసింది. ఇదే క్రమంలో ఈ దశాబ్దంలోనే అత్యుత్తుమ సేవలు అందించిన బ్యాంకుగా జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైంది. ఈ బ్యాంకు చరిత్రలోనే ఇది అత్యుత్తమ అవార్డుగా చెప్పవచ్చు. అంతే కాకుండా, కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు అనుబంధంగా ఉన్న 128 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఒకటైన చొప్పదండి పీఏసీఎస్ కూడా దేశంలోనే రెండు దశాబ్దాలుగా అత్యుత్తమ సంఘంగా అవార్డు సాధిచింది. కాగా, శుక్రవారం దేశరాజధానిలో కేంద్ర మంత్రి అమిత్‌షా అవార్డులు పంపిణీ చేయగా నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరుతో పాటు కేడీసీసీబీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, చొప్పదండి సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి అందుకున్నారు.