వేములవాడ, జూన్ 25: వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తానన్న స్నేహితుడిని నమ్మి కారు ఇస్తే.. ఆ వాహనంలోని ముఖ్యమైన పరికరాలే మార్చేస్తూ పట్టుబడ్డాడో ప్రబుద్ధుడు. వేములవాడ పట్టణంలో ఈ ఘటన జరుగగా, యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వేములవాడ పట్టణ ఎస్ఐ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణానికి చెందిన రవికుమార్ తనకు పరిచయమున్న సన్నిహితుడు సాయి కృష్ణ వద్దకు వెళ్లి వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తున్నానని, కారు కావాలని అడిగాడు.
దీంతో సాయి కృష్ణ తన మారుతీ ఎర్టిగా వాహనాన్ని ఇచ్చాడు. అయితే వస్తానన్న సమయం దాటిపోవడంతో సాయికృష్ణ తన వాహనానికి అమర్చిన జీపీఎస్ ట్రాకింగ్‌ను తన మొబైల్ ఫోన్ ద్వారా పరిశీలించాడు. అప్పుడే అసలు విషయం తెలిసింది. వాహనం రాజన్న గుడి వద్ద కాకుండా వర్ షాప్‌లో ఉన్నట్టుగా గుర్తించాడు. వెంటనే మరో స్నేహితుడి ద్వారా అకడికి చేరుకొని వాహనాన్ని ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు.
అప్పటికే అందులో అవసరం ఉన్న పరికరాలను తొలగించి ఇతర వాహనానికి అమర్చుకున్న విషయాన్ని సాయికృష్ణ గుర్తించాడు. వెంటనే వేములవాడ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రవికుమార్, షెడ్ మెకానిక్ కల్యాణ్ పై కేసు నమోదు చేశామని ఎస్ఐ అంజయ్య తెలిపారు.