Godavarikhani | ఫర్టిలైజర్‌సిటీ, డిసెంబర్ 3: విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్ లు ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ సీఐ జే కృష్ణమూర్తి తెలిపారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు గోదావరిఖని ఎల్ బీ నగర్ లోని ఐఏఎస్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల బుధవారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాలపై ముద్రించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెల్ఫోన్లకు వచ్చే అనుమానిత మెసేజ్‌లు, లింక్‌లకు స్పందించొద్దని ఇంటి వద్ద తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. ప్రపంచంలో ఎక్కడో మూల నుంచి టెక్నాలజీతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న సంఘటనలపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే విద్యార్థులు సైతం చదువుపైనే ఎక్కువగా దృష్టి సారించాలనీ, సెల్‌ఫోన్ కు బానిసలు కావడం వల్ల భవిష్యత్ మందగిస్తుందని సూచించారు.
సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలన్నారు. ఓటీపీలు షేర్ చేయడం, ఆన్లైన్లో ఉద్యోగాల కోసం వెతకడం, అనుమానిత లింక్ లు క్లిక్ చేయగానే తమ అకౌంట్లో ఉన్న డబ్బులు ఖాళీ అవుతాయన్నారు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కినట్లు గుర్తిస్తే వెంటనే సమీప పోలీస్టేషన్లో నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్, వెంకటేశ్, షీ టీం ఎస్సై అనూష, రమేష్, ప్రవళిక, పాఠశాల ప్రిన్సిపాల్ పేరం హేమలత, టీచర్లు సునీత, స్వప్నరాణి, శివ, శ్రీను అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.