పెద్దపల్లి కమాన్ : బీసీలు ఏకమై కాంగ్రెస్ సర్కార్ కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ( Dasari Manohar Reddy ) బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు బీసీలకు ( BCs ) కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీల గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో మభ్యపెట్టిన కాంగ్రెస్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మహిళలకు ఇస్తానన్న రూ. 2,500, వృద్ధులకు పెంచుతామన్నా రూ. 4 వేలు ఎప్పుడిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీసీలు ఏకమై కాంగ్రెస్ సర్కార్ కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో స్థానిక ఎన్నికల్లో అనధికారికంగా 50 శాతానికి పైగా బీసీలకు అవకాశం కలిపించిదని గుర్తు చేశారు. మార్కెట్ కమిటీ పాలకవర్గాల్లో అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి బీసీలను ఆర్థికంగా ఎదిగేలా కృషి చేశారని కొనియాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ప్రతి ఏటా రూ. 20 వేల కోట్లు మంజూరు చేస్తామని చెప్పి 20 నెలలు గడుస్తున్నా 20 రూపాయలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో గంట రాములు యాదవ్, పాల రామారావు, ఉప్పు రాజ్ కుమార్, గుణపతి, నూనెటి సంపత్, మార్క్ లక్ష్మణ్, బైరెడ్డి రాంరెడ్డి, సందీప్ రావు, నిదనాపురం దేవయ్య, అల్లా శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రావు, సతీష్ గౌడ్ పాల్గొన్నారు.