కొదురుపాకకు చెందిన డాక్టర్ వైరాగ్యం రాజలింగం హైదరాబాద్‌లోని సరోజినీదేవీ కంటి దవాఖానలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన సతీమణి రీటా బహదూర్షా సైతం ఓ ప్రైవేట్ వైద్యశాలలో కంటి వైద్యనిపుణురాలిగా కొనసాగుతున్నారు. రాజలింగం పుట్టిన ఊరుపై మమకారం, తల్లిదండ్రులపై గౌరవంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులతోపాటు ఊరి జనానికి సేవ చేయాలని సంకల్పించారు. తల్లిదండ్రులు బుచ్చమ్మ-చంద్రమౌళి పేరిట 2021 డిసెంబర్ 18న గ్రామంలో బీసీఎం కంటి దవాఖానను ప్రారంభించారు. రెండంతస్తులలో సకల వసతులతో నిర్మించారు.
ఇందులో కార్పొరేట్‌స్థాయి సౌకర్యాలను కల్పించారు. ఇందులో కంటి వైద్య నిపుణులు, ఆప్తామాలజిస్ట్, ఏఎన్ఎం, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇక్కడ ఆదివారం మినహా నిత్యం కంటి వైద్య పరీక్షలు చేస్తారు. రూ.50 నామినల్ చార్జి మాత్రమే తీసుకుంటారు. ఆపరేషన్ అవసరం ఉన్నవారిని గుర్తిస్తారు. వీరికి ప్రతి 15 రోజులకోసారి ఆదివారం రాజలింగం- రీటా బహదూర్షా దంపతులు ఆపరేషన్లు చేస్తారు. అలాగే ప్రతి బుధవారం రీటాబహదూర్షా సేవలందిస్తారు. ఇలా కొదురుపాక వైద్యశాలలో ఇప్పటివరకు జిల్లానేకాదు కరీంనగర్ ఉమ్మడి జిల్లాతోపాటు సిద్దిపేట వాసులు 1065 మందికి ఫ్రీ ఆపరేషన్లు చేశారు.
బీసీఎం దవాఖాన ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు, కరీంనగర్, జగిత్యాల జిల్లాలోనూ సేవలందిస్తున్నారు. దవాఖాన వైద్యులతో తమ బృందంతో వెళ్లి నిత్యం ఏదో ఒక గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 93 గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, 9243 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేశారు.
గ్రామీణ ప్రజలకు ఉచిత కంటి వైద్యసేవలందించడం, వారి కండ్లలో కాంతులు నింపడమే లక్ష్యం. అందుకే గ్రామంలో దవాఖాన ప్రారంభించా. ఇప్పటివరకు 1065 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయడం, దవాఖాన నేటితో రెండేండ్లు పూర్తి చేసుకొని మూడో వసంతంలోకి అడుగు పెడుతుండడం ఆనందంగా ఉంది. మున్ముందు ఇదే స్ఫూర్తితో ముందుకుసాగుతాం.
– డాక్టర్ వైరాగ్యం రాజలింగం,
మసక బారిన కండ్లల్లో కొత్త వెలుగు ప్రసరిస్తోంది. ఆర్థిక స్థోమత లేక వైద్య పరీక్షలు నిర్వహించుకోలేని నిరుపేదలకు ఎంతో స్వాంతన కలుగుతున్నది. కొదురుపాకలోని బీసీఎం కంటి దవాఖాన భరోసాగా నిలుస్తున్నది. డాక్టర్ వైరాగ్యం రాజలింగం పుట్టిన గడ్డపై మమకారంతో తన తల్లిదండ్రులు బుచ్చమ్మ-చంద్రమౌళి స్మారకార్థం సరిగ్గా రెండేండ్ల క్రితం ఏర్పాటు చేసిన వైద్యశాల ఉచిత ఆపరేషన్లకు కేరాఫ్‌గా మారింది. దవాఖాన ప్రారంభించిన అతి తక్కువ టైంలోనే తన సతీమణి రీటా బహదూర్‌షాతో కలిసి ఏకంగా 1065 మందికి శస్త్రచికిత్సలు చేసి చూపును ప్రసాదించగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఇంకా చుట్టు పక్కల గల 93 గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి 9243 మందికి పరీక్షలతో పేదల వైద్యశాలగా మారిన బీసీఎం దవాఖాన నేటితో మూడో వసంతంలోకి అడుగుపెట్టబోతున్నది.
– బోయినపల్లి, డిసెంబర్ 17
కంటి వైద్య నిపుణులు డాక్టర్ వైరాగ్యం రాజలింగానికి ది బెస్ట్ డాక్టర్‌గా పేరుంది. లేజర్ (ప్యాకో) శస్త్రచికిత్సల నిర్వహణలో ఎక్స్‌ఫర్ట్. రెండేండ్ల క్రితం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభకు కంటి ఆపరేషన్ చేశారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు హైదరాబాద్‌లో కంటి శస్త్రచికిత్స చేశారు. విరసం నేత వరవరరావుకు గత నవంబర్ 3 కంటి ఆపరేషన్ చేశారు.