కమాన్‌పూర్, మార్చి 31: దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని, తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌తో ఏప్రిల్ 2న ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లవెల్లి శంకర్ కోరారు. కమాన్‌పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు బీసీల పోరు గర్జన (BC Poru Garjana) వాల్‌పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో అమలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్‌లపై గురుతర బాధ్యత ఉందన్నారు.
తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కుల గణన, తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ అమలు జరిగే వరకు బీసీల పక్షాన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. బీసీ సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షులు తోట రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నీలం శ్రీనివాస్, పోలుదాసరి సాయి కుమార్, దేవునూరి చంద్రమౌళి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాస రవి, గుర్రాల చంద్రమౌళి, జంగపెల్లి చిన్న శ్రీనివాస్, సుంచు శ్రీనివాస్, నర్సింగం, కొండపాక శంకర్, చిదురాల సదయ్య, అనిల్ గౌడ్, దీకొండ రమేష్, దాసరి రామస్వామి, దాసరి రామచంద్రం, కూనమల్ల రాజనర్సు, మట్ట రాజయ్య పాల్గొన్నారు.