Jagityal | జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో (అంబేద్కర్ కూడలి) తహసీల్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జీవో నం 46 ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం బీసీ నాయకుడు చింతల గంగాధర్ మాట్లాడుతూ త్వరలో తెలంగాణ లో జరగబోయే సర్పంచి ఎన్నికలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పరిమితి 50 శాతం కు మించకూడదనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 46 విడుదల చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని పేర్కొన్నారు.
చట్టబద్ధత లేని జీవోలు నిలువవని తెలిసి ఎన్నికలకు ముందు అడ్డుగోడలు హామీలు ఇచ్చి, మళ్లీ కోర్టు పరిధిలోకి తీసుకెళ్లి బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని వారున్నారు. చట్టబద్ధత లేని జీవోలను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించలేక, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో బీసీలు బలిపశువులౌతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ యువజన నాయకులు ముకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల జనాభా 60 శాతం ఉన్నా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు.
జీవో నం 46 ను వెంటనే రద్దు చేసి జీవో నం 9 కు చట్టబద్ధత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల గంగాధర్, గాజుల నాగరాజు, జిల్లా కార్యదర్శి గుగ్గిల్ల సత్యనారాయణ, జిల్లా మహిళ అధ్యక్షురాలు గంగం జలజ, యువజన విభాగం అధ్యక్షుడు బాజోజు ముకేష్ ఖన్నా, పెండెం గంగాధర్, గంగిపెల్లి వేణుమాధవ్, లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు.