కాంగ్రెస్ నయవంచనపై అట్టుడుకుతున్నది. కులగణన పేరిట ప్రభుత్వం ఆడుతున్న నాటకంపై ఆగ్రహం పెల్లుబికుతున్నది. రిజర్వేషన్ల పేరిట తమను మోసగించారని బీసీలు, వర్గీకరణ పేరిట దగా చేశారని దళితులు నిప్పులు చెరుగుతున్నారు. స్థానిక సంస్థల్లో అధికారికంగా 42 శాతం అమలు చేస్తామని చెప్పి, ప్రస్తుతం మాటమార్చడంపై బీసీ సంఘాల నాయకులు కుతకుతలాడుతున్నారు. కులగణన నివేదిక తప్పులతడకగా రూపొందించారని, ఉద్దేశపూర్వకంగా బీసీ జనాభాను తగ్గించి చూపారని మండిపడుతున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను విస్మరించి, కేవలం పార్టీ పరంగా వాటా కల్పిస్తామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని కాంగ్రెస్ మరిచిపోయిందని, రాష్ట్రంలోని బీసీలను వెన్నుపోటు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఎస్సీ వర్గీకరణపై దళితబహుజనులు రగిలిపోతున్నారు. అసెంబ్లీలో ఏకపక్షంగా తీర్మానం చేశారని మాలసంఘాల నాయకులు మండిపడుతుండగా, న్యాయబద్ధంగా తమకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నా 9శాతం ఇవ్వడంఅన్యాయమని మాదిగ సామాజిక వర్గం నాయకులు భగ్గుమంటున్నారు.
– కరీంనగర్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ)
కుతకుతలాడుతున్న బీసీలు
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్‌ను పాతరేస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, తీరా ఇప్పుడు చేతులెత్తేస్తున్నది. ఆ బంతిని కేంద్రం కోర్టులోకి విసిరి చేతులు దులుపుకొంటున్నది. బీసీ కులగణనపై ఆ పార్టీ చేసిన మోసంపై రెండు మూడు రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతున్నది. తమకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ బీసీ సంఘాల నాయకులు కుతకుతలాడుతున్నారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ చెప్పిందేమిటి? అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నదేమిటి? అని చర్చిస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ కులాల లెక్కలు తగ్గించిందని ఆరోపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో 51 శాతం ఉన్న బీసీలు పదేళ్లలో పెరగాలి కానీ, తగ్గడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పదేళ్ల కిందనే 51 శాతం ఉన్న బీసీలు ఇప్పుడు 46 శాతానికి ఎలా తగ్గుతారని నిలదీస్తున్నారు.
అగ్ర కులాల రిజర్వేషన్లు కాపాడేందుకే ఈ తరహా కుట్ర చేసిందని ఆగ్రహిస్తున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను కూడా సీరియస్‌గా తీసుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత ఇప్పట్లో కాకపోవచ్చని, పార్టీ పరంగా తాము వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం సీట్లు బీసీలకే ఇస్తామని, మిగతా పార్టీలు కూడా ఇవ్వాలని కోరడం పెద్ద మోసమని ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ అంటే ఎంత మోసకారి పార్టీనో ఈ ఒక్క విషయంలోనే తేటతెల్లమైందని మండిపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ఎక్కడా చిత్త శుద్ధిని ప్రదర్శించడం లేదని, తప్పుడు లెక్కల నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టి, తీర్మానాన్ని కేంద్రానికి పంపించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తున్నారు. బీసీ కులగణన నివేదిక తమ ఉనికికి ప్రమాదకరంగా మారిందని, వెంటనే దీనిని రద్దు చేసి రీ సర్వే చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అన్ని కులాలకు ఆమోదయోగ్యమై ఉండాలని స్పష్టం చేస్తున్నారు. అగ్ర కులాల సంఖ్యను ఎక్కువ, తమ కులాల సంఖ్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం జరుగుతున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అణిచివేసే కుట్రకు తెర తీసినట్టు స్పష్టమైందని ఆరోపిస్తున్నారు.
రగిలిపోతున్న దళితులు
ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ తమను దగా చేసిందని దళితులు మండిపడుతున్నారు. ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై మాల సామాజికవర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, రిజర్వేషన్ల విషయంలో తమకు అన్యాయం జరిగిందని మాదిగ, ఉప కులాల నాయకులు గుర్రుగా ఉన్నారు. రాష్ట్రంలో 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించారని, ఈ లెక్కన 32 లక్షల మంది ఉన్న మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు రావాల్సి ఉన్నా 9శాతానికి తగ్గించారని ఎమ్మార్పీస్ నాయకులు భగ్గుమంటున్నారు. వర్గీకరణలో లోపాలతో వెనుకబడిన కులాల గ్రూప్‌లోకి అభివృద్ధి చెందిన కులాలు వచ్చాయని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ మాదిగలకు వ్యతిరేకమేనని విరుచుకుపడుతున్నారు. స్థానిక ఎన్నికలకు కూడా ఎస్సీ వర్గీకరణ పాటించాలని, జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి..
కులగణన విషయంలో తదుపరి కార్యాచరణను ప్రభుత్వం ప్రకటిస్తుందని అందరూ భావించారు. కానీ, రెండు రోజుల క్రితం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలనే ప్రకటన రూపంలో కౌన్సిల్, అసెంబ్లీలో చెప్పడం ద్వారా ఉపయోగమేమిటో ప్రభుత్వం చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తారా.. లేదా? అన్నది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. బీసీలను, బీసీ ముస్లింల జనాభాను వేరు చేసి ప్రభుత్వం చెబుతున్నది. ఇది కేవలం జనాభాను తకువ చేసి చూపించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు. ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కార్యాచరణను ప్రకటించాలి. ఇంతవరకు కచ్చితంగా డేటానే లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదు. 2011జనాభా లెకలు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా పదేండ్లలో సగటున 13.5శాతం జనాభా పెరుగుతున్నది. ఆ లెకన ఇప్పుడు తెలంగాణ జనాభా 4కోట్ల 18లక్షలు ఉండాలి. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా తగ్గినట్లు, ఓసీల జనాభా పెరిగినట్టు కనిపిస్తున్నది. అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుంది? తమ ఇళ్లకు సర్వే చేయడానికి ఎన్యుమరేటర్లు రాలేదని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. కాబట్టి మరోసారి వారి వివరాలను సేకరించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలి.
-కోరుకంటి చందర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే
9 శాతం అన్యాయమే
వర్గీకరణలోని లోపాలతో వెనుకబడిన కులాల గ్రూపులోకి అభివృద్ధి చెందిన కులాలు వచ్చాయి. రాష్ట్రంలో 15లక్షలు ఉన్న మాలలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు 32లక్షల జనాభా ఉన్న మాదిగలకు కేవలం 9శాతమే ఇవ్వడం అన్యాయం. న్యాయబద్ధంగా 11శాతం రిజర్వేషన్లు కల్పించాలి. దీనిపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించాలి. లేదంటే రిజర్వేషన్ల కోసం ఎంత వరకైనా పోరాడుతం – సంపతి కొంరయ్య, ఓబులాపూర్( ఇల్లంతకుంట రూరల్)
అబద్ధాలు చెప్పడం అలవాటైంది
శాసనసభను అడ్డం పెట్టుకొని అబద్దాలు చెప్పడం, మోసం చేయడం కాంగ్రెస్ నాయకులకు అలవాటైంది. ఇప్పటికే శాసన సభలో 1400 అబద్ధాలు చెప్పి ఉంటరు. నిజాయితీగా సర్వే చేయాలంటే ఫస్ట్ ముఖ్యమంత్రి ఇంటి నుంచే సర్వే మొదలు పెట్టాలి. అక్కడి నుంచి మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారులు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రజల వద్దకు వెళ్లాలి. సరైన సర్వే రావాలంటే ఎస్కేఎస్ మాదిరిగా ఒకే ఒక్కరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేసి ఒక్కరోజే చేయాలి. కానీ ప్రభుత్వం ఈ సర్వేను అలా చేయలేదు. అంతా ఆగమాగం చేశారు. ఇలాంటి సర్వేలు ప్రజలను మోసం చేయడానికే పనిచేస్తాయి తప్ప. చట్టబద్ధత కల్పించడానికి పనిచేయవు. ఇప్పటికే అందులో 6శాతం తగ్గించారు. బీసీలకు చట్టబద్ధతతోనే న్యాయం జరుగుతుంది. అందులో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని 42శాతం ఇవ్వాలని ఎక్కడ డిమాండ్ చేయలేదు. కేంద్రానికి పంపిన తీర్మానంలో కూడా ఎలాంటి క్లారిటీ లేదు. దీనిని బీసీ వర్గాల ప్రజలంతా ఖండిస్తున్నారు. ఇప్పటికైనా నిజాయితీని నిరూపించుకోవాలంటే సమగ్రమైన సర్వే చేసి చట్టబద్ధత కల్పించి సుప్రీంకోర్టును, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బీసీలకు న్యాయం చేయాలి.
-గంట రాములు, మాజీ జడ్పీటీసీ (ఓదెల) పెద్దపల్లి జిల్లా
మరోసారి మోసం చేసే కుట్రే..
ప్రపంచంలోనైనా, భారత దేశంలోనైనా ప్రతి పదేండ్లకు ఒక సారి జనాభా లెక్కలు తీస్తున్నరు. ఎక్కడైనా జనాభా శాతం పెరుగుతూనే కనిపించింది. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో మాత్రం బీసీల జనాభా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జనాభా మాత్రమే తగ్గుతుంది. ఒక్క ఓసీలది మాత్రమే పెరుగుతుంది. ఈ విధంగా కుల గణన చేయడం ఎంత వరకు కరెక్టు. ఇంత ఘోరంగా ఏ సర్వేనైనా ఉంటుందా? అనుమానాలు ఉన్నప్పుడు ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే బీసీలది 46శాతం జనాభా అంటూనే లోకల్ బాడీస్‌లో 42శాతం రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. 46శాతం జనాభాకు 42శాతం ఇవ్వడం తక్కువ చేసి ఇవ్వడం కాదా..? ఓబీసీలకు 46శాతం కాదు 56.3శాతం జనాభా ఉంది. దానికి తగ్గట్టుగా 56.3శాతం రిజర్వేషన్ అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో ఓబీసీల్లో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. దాని గురించి మాత్రం చెప్పడం లేదు. అసలు ఈ సర్వే చేసి ఏం సాధించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఏం లాభం. ఇదంతా ప్రజలకు మాయ మాటలు చెప్పడానికి చేసిన సర్వేనే. బీసీలను కాంగ్రెస్ మరో మారు మోసం చేసే కుట్రే ఇది.
– దాసరి ఉష, బీఆర్ఎస్ నాయకురాలు (పెద్దపల్లి)
రీ సర్వే తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీ కుల గణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఇదంతా తప్పుల తడక అని బీసీ సంఘాలు, మేధావులు ఎంత మొత్తుకున్నా వినిపించుకోవడం లేదు. 1931 జనాభా లెక్కల ప్రకారంగానే దేశంలో బీసీల సంఖ్య 52 శాతం ఉంది. ఇప్పటికి 70 శాతం ఉంటుందని ఒక నివేదిక వెల్లడిస్తున్నది. కానీ, రాష్ట్రంలో మాత్రం 46 శాతంగా చూపడం ఏమిటీ? ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రగానే మేం భావిస్తున్నాం. కేవలం ఎన్నికల తంతు కోసమే ఈ తప్పుడు నివేదికను ఆగమేఘాల మీద అసెంబ్లీలో ప్రవేశ పెట్టి బీసీల ఓట్లు దండుకోవాలని చూస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన మాటపై కాంగ్రెస్ నిలబడడం లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం దేనికి సంకేతం? బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం మాకు 42 శాతం చట్టబద్ధమైన రిజర్వేషన్లు దక్కాలి. లేదంటే కాంగ్రెస్‌ను రాష్ట్రంలో కూకటి వేళ్లతో సహా పెకిలించే వరకు విశ్రమించం.
– బొల్లం లింగమూర్తి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
పోరాటానికి సిద్ధమవుతాం
ఎస్సీ వర్గీకరణతో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీలలో అభివృద్ధి చెందిన కులాలకే మళ్లీ రిజర్వేషన్లలో ఎక్కువ స్థానం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. మాదిగల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుట్ర చేస్తున్నాడని అనిపిస్తుంది. 15లక్షలు ఉన్న మాలలకు 5శాతం రిజర్వేన్లు కల్పిస్తే.. 32లక్షల జనాభా ఉన్న మాదిగలకు 11శాతం రిజర్వేషన్లు దక్కాలి. కానీ, తమకు దక్కకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే పోరాటానికి సిద్ధమవుతాం.
– గుండేడి ప్రశాంత్, ఓబులాపూర్ (ఇల్లంతకుంట రూరల్)
ఎస్సీలకు ఒరిగిందేమీ లేదు
ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే అసంబద్ధం. పూర్తిగా తప్పుల మయం. సర్వేతో ఎస్సీలకు ఒరిగిందేమి లేదు. ఎస్సీల్లో 18 శాతంగా ఉన్న మాదిగలకు న్యాయబద్ధంగా 11 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ, కొన్ని వర్గాలకు మేలు చేసేందుకు మరికొందరికి అన్యాయం చేస్తున్నది. ఇది సరికాదు. అట్టడుగు వర్గాల్లో ఉన్న ఎస్సీలకు న్యాయం చేయాలి.
– కాంపెల్ల హన్మాండ్లు, దళిత సంఘం నాయకుడు, దట్నూర్ (గొల్లపల్లి)