ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ రానేవచ్చింది. నేడు ఎంగిలిపూలతో మొదలై, సద్దుల దాకా (అక్టోబర్ 3వ తేదీ) ఊరూరా అంబరాన్నంటనున్నది. తొమ్మిది రోజుల పాటు వాకిళ్లన్నీ పూదోటలుగా కానుండగా, ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ సాగే ఆటాపాటలతో వాడవాడా హోరెత్తనున్నది. ఆడబిడ్డలు, యువతులు, చిన్నారుల ఆటపాటలతో ప్రతి ఇల్లూ సందడిగా మారనున్నది.
కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 24 : పూల జాతరకు వేళయింది. తొమ్మిది రోజులపాటు సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఆదివారం ప్రారంభం కానున్నది. ఇప్పుడిప్పుడే ఆడబిడ్డలు మెట్టినింటి నుంచి పుట్టింటికి చేరుకుంటున్న కోలాహలం మొదలవగా, నేటి నుంచి పల్లెలు, పట్టణాలు, నగరాలు పూల వనాలను తలపించనున్నాయి. ప్రపంచమంతా పువ్వులతో దేవుడిని కొలిస్తే, ఆ పూలనే పూజించే అరుదైన సంస్కృతి మనది. వేల ఏళ్ల క్రితమే తెలంగాణ ప్రాంతంలో ‘బతుకమ్మ’గా పుట్టి, ఖండాంతరాలకు చేరిందీ పండుగ. బతుకమ్మ అంటే ఒక పండుగ మాత్రమే కాదు.. బతికున్న మన చరిత్ర. మన సంప్రదాయం. ప్రకృతితో మనకున్న అవినాభావ సంబంధం. ఇంకా చెప్పాలంటే మన జీవన విధానం. నేటి నుంచి బతుకమ్మ సంబురం ఎంగిలిపూలతో మొదలవుతుండగా, ఇక తొమ్మిది రోజులపాటు ఉత్సవాలతో ఊరూరూ సందడిగా మారనున్నది. ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ సాగే ఆడబిడ్డల ఆటపాటలతో వీధివీధీ హోరెత్తనున్నది.
బొడ్డెమ్మతో మొదలై..
బతుకమ్మ పండుగ ముందుగా బొడ్డెమ్మతో మొదలవుతుంది. ఎర్రమట్టితో బొడ్డెమ్మను పేర్చి పూలతో అలంకరించి వాకిట్లో ఉంచి మహిళలు, యువతులు తొమ్మిది రోజుల పాటు ఆడి..పాడి చివరి రోజున నిమజ్జనం చేస్తారు. తర్వాత ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
వేములవాడలో ఏడు రోజులే…
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో బతుకమ్మ పండుగను ఏడు రోజులు మాత్రమే జరుపుకుంటారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు పట్టణంలో ఏ వీధి చూసినా పూలజాతరే కనిపిస్తుంది. మెట్టినింట బతుకమ్మ ఆడిన మహిళలు పుట్టినింట, పుట్టినింట ఆడిన మహిళలు మెట్టినింట ఆడే సంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారమని రాజన్న ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ వెల్లడించారు.
ఆడపిల్ల ఉన్న ఇంట్లో కొలువైన బతుకమ్మ
సంస్కృతి, సంప్రదాయాల్లో బతుకమ్మ మమేకమైంది. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో బతుకమ్మ ఉంటుంది. ప్రతి ఏటా బతుకమ్మను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గౌరమ్మను పూజించిన తర్వాత బతుకమ్మను తయారు చేసి చివరగా చెరువులో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మను పేర్చేటప్పుడు రెండు నుంచి ఐదు లేదా ఏడు రకాల పూలను వాడుతారు. తాంబాలంలో గుమ్మడి ఆకులకు బొట్టుపెట్టి పువ్వులతో పేర్చుతారు. ఇందులో తంగేడు, గునుక, గన్నేరు, గులాబీ, కట్ల, తెల్లగన్నేరు, ఎర్రగన్నేరు, తెల్ల మల్లెలకు చోటు ఉంటుంది.
పెత్రమాస రోజున మొదటి బతుకమ్మ
ఆడబిడ్డలు అమావాస్య రోజున మొదటి రోజు బతుకమ్మ ఆడతారు. ఆ రోజు పెత్రమాస (పెత్తర అమావాస్య) అని అంటారు. ఈనెల 25న మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. రెండో రోజు అటుకుల బతుకమ్మ. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ. ఐదో రోజు అట్ల బతుకమ్మ. ఆరో రోజు అలిగిన బతుకమ్మ(ఈరోజు బతుకమ్మ ఆడరు). ఏడో రోజు వేపకాయల బతుకమ్మ. 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ. 9వ రోజు సద్దుల బతుకమ్మ ఆడనున్నారు.
ఎంగిలిపూలతో మొదలు
తొమ్మిదిరోజుల పాటు వాకిళ్లన్నీ పూదోటలు
ఆడిపాడనున్న ఆడబిడ్డలు, చిన్నారులు
ఊరూరా హోరెత్తనున్న సంబురాలు
అక్టోబర్ 3న సద్దుల
1. అమావాస్య నాడు.. ఎంగిలి పూల బతుకమ్మ..
నైవేద్యం: నువ్వులు…బియ్యం పిండి
2. పాడ్యమి నాడు.. అటుకుల బతుకమ్మ..
నైవేద్యం: సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు
3. విదియ నాడు.. ముద్దపప్పు బతుకమ్మ..
నైవేద్యం: ముద్దపప్పు, బెల్లం
4. తదియ.. నానబియ్యం బతుకమ్మ..
నైవేద్యం: నానేసిన బియ్యం, బెల్లం, పాలతో చేసిన పదార్థం
5. చవితి.. అట్ల బతుకమ్మ.. నైవేద్యం: అట్లు
6. ఆరో నాడు అర్రెం.. బతుకమ్మ ఆడరు
7. షష్ఠి.. వేపకాయల బతుకమ్మ..
నైవేద్యం: బియ్యంపిండి, బెల్లం
8. సప్తమి.. వెన్నముద్దల బతుకమ్మ..
నైవేద్యం: నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం
9. అష్టమి.. సద్దుల (పెద్ద) బతుకమ్మ..
నైవేద్యం: కుడక, బియ్యం, పెసర, నువ్వులు, పల్లి, నెయ్యితో చేసిన సత్తు పిండి
పూల బతుకమ్మను పేర్చడం ఇలా..
ఇత్తడి తాంబూలంలో ముందుగా పసుపు, కుంకుమ వేసి పూజ చేయాలి. గుమ్మడాకులపై పొడవైన దారం ఉంచాలి. దారంపైన తంగెడు పూలతో ఒకటి రెండు వరుసలు తాంబూలంలో మొదటి వరుస చుట్టూ వలయాకారంగా పేర్చాలి. తర్వాత గునుగు పూలను చక్కగా పేర్చాలి.
అందుబాటులో ఉన్న బంతి, చేమంతి, నందివర్ధనం, గులాబీ, గుమ్మడి, గన్నేరు, మందారం, సీతమ్మ జడపూలతో వలయాకారంగా ఓపికతో నేర్పుగా పేర్చుకుంటూ పోవాలి. తాంబూలం మధ్యలో ఖాళీగా ఉన్న స్థలంను ఆకులు, తొడిమలు, పూలతో నిండుగా నింపాలి. ఇలా చేయడం ద్వారా బతుకమ్మ నిండుగా కనిపిస్తుంది. అడుగు నుంచి బతుకమ్మ శిఖరం వరకు నచ్చిన పూలతో పేర్చుకోవచ్చు.
పేర్చడం పూర్తయిన తర్వాత పైభాగంలో పెరుగన్నతో కూడిన సద్దిని ఒక తెల్లటి వస్త్రంలో మూటగా కట్టి పెట్టాలి. సద్దిపక్కన పసుపుతో చేసిన గౌరమ్మను తమలపాకులో పెట్టి ఉంచాలి.
పేర్చిన పూలు పడిపోకుండా ఉండేందుకు బతుకమ్మ శిఖరం వరకు కట్టాలి.
తర్వాత బతుకమ్మకు పూజలు చేసి ఆటపాటలతో అలరించి మొక్కులు తీర్చుకోవాలి.
బతుకమ్మ పైభాగంలో ఉంచిన పసుపు గౌరమ్మను తీసి ఆడబిడ్డలకు అందించాలి. తర్వాత బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేయాలి.
అందమంతా పేర్చడంలోనే..
అనాదిగా వస్తున్న ఈ పండుగకు మళ్లీ పూర్వవైభవం తీసుకవచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి ఏటా మహిళలకు బతుకమ్మ చీరలను కానుకగా అందజేసి పండుగకు ప్రత్యేక గుర్తింపు తీసుకవచ్చింది. “బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో” అంటూ ఆడిపాడాలంటే ముందుగా ఒక అందమైన బతుకమ్మను తయారు చేయాల్సిందే. బతుకమ్మను పేర్చడలోనే అందమంతా దాగి ఉందంటున్నారు మహిళలు.
కావాల్సిన వస్తువులు
పసుపు, కుంకుమ, దారం, ఇత్తడి తాంబూలం, గుమ్మడి/బీర/ సోరాకులు, అందుబాటులో ఉన్న వివిధ రకాల పూలు, పెరుగన్నం, తెల్లని వస్త్రం అవసరం.