కరీంనగర్ కార్పొరేషన్/కొత్తపల్లి/కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 26 : ‘రామరామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో..’ అంటూ శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకొన్నారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ కాలేజీల్లో వేడుకలు నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ఆటాపాటలతో సందడి చేశారు.
కరీంనగర్లో జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో వేడుకలకు కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరు కాగా, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీకిరణ్, అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులతో కలిసి ఆడిపాడారు. అలాగే రెవెన్యూ గార్డెన్తోపాటు కేడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. తర్వాత స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు.