ప్రాథమిక సహకార పరపతి సంఘాలు కట్టుతప్పుతున్నాయి. రైతులకు అండగా నిలిచి పురోగమనంలో ముందుకు తీసుకువెళ్లాల్సిన సొసైటీల్లో అవినీతి మరకలు కనిపిస్తున్నాయి. నిధుల దుర్వినియోగం, రైతుల రుణమాఫీల్లో అవకతవకలు, రైతుల వివరాలు బ్యాంకులకు సమర్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండగా, మరోవైపు వాటాధనాల విషయంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఇటీవల జరిగిన పలు ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. మల్యాలకు చెందిన రైతు రూ.లక్ష లోన్ తీసుకుంటే రూ.2లక్షల పైన నమోదై ఉండడం, జైనకు చెందిన మరొక రైతు గతంలో రుణమాఫీ జరిగి ఎన్వోసీ సైతం తీసుకున్న లోన్ కట్టలేదని రికార్డుల్లో ఉండడం అనుమానాలకు తావిస్తుండగా, రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
జగిత్యాల, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 52 సంఘాలు, 17 కేడీసీసీ బ్యాంకు శాఖలు ఉన్నాయి. వీటి పరిధిలో వేలాది మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వీరు వందల కోట్ల రుణం పొందారు. ఈ సంఘాల ద్వారా రైతులకు, రైతు ఉత్పత్తులకు సేవలందిస్తున్నారు. మొత్తంగా 270కి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి సీజన్లో ధాన్యం సేకరిస్తున్నారు. ఒకానొక దశలో 3లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోళ్లు జరిపి 671 కోట్ల చెల్లింపులు జరిపిన చరిత్ర సంఘాలకు ఉన్నది. అయితే, ఇటీవలి కాలంలో వరుసగా సింగిల్ విండోలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగిల్ విండోల్లో వాటాధనం చెల్లింపుల విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘంలో సభ్యుడైన రైతు పంట రుణం తీసుకునే సమయంలో రుణ మొత్తంలో పదిశాతాన్ని వాటాధనంగా చెల్లిస్తున్నారు. ఇది సభ్యుడి పేరుపైనే ఉంటుంది. ఒకసారి వాటాధనం చెల్లించిన రైతు మరోసారి చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో తీసుకున్న రుణం కంటే ఎక్కువగా తీసుకుంటే, అదనంగా తీసుకుంటున్న మొత్తంలో పదిశాతాన్ని వాటాధనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇందులో పెద్ద స్కామ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ అంశాన్ని ఆసరాగా చేసుకొని వాటాధనం చెల్లింపులో సిబ్బంది తమ చేతివాటం చూపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు ఒక సభ్యుడు లక్ష రుణం తీసుకుంటే, ఆయన వద్ద నుంచి 10వేలు వాటాధనంగా తీసుకొని, 90 వేలు రైతుకు అందజేస్తున్నారు. 2014లో స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష లోపు రైతులు తీసుకున్న రుణాన్ని మాఫీ చేసిన విషయం తెలిసిందే. అంటే కేసీఆర్ రైతు తీసుకున్న మూలధనం వాటాతో సహా చెల్లించి వేశాడు. ఈ లెక్కన ఒక్కసారి రుణం తీసుకున్న రైతుకు సంబంధించిన మూలధనం వాటా పరపతి సంఘం వద్ద ఉన్నట్టే లెక్క. రైతు రుణమాఫీ జరిగిన తర్వాత మరోసారి లక్ష రుణం తీసుకుంటే పదిశాతం వాటాధనం చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, చాలా సింగిల్ విండోలు రైతుల వద్ద నుంచి రెండోసారి, మూడోసారి రుణాలు తీసుకున్న సందర్భంలో వాటాధనంగా పదిశాతం డబ్బును మినహాయించుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. మెజార్టీ సంఘాల్లో ఈ తతంగం జరిగిందని చెబుతున్నారు.
రైతు రుణమాఫీ జాబితాల విషయంలోనూ సింగిల్ విండోలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ పరిధిలో రుణాలు తీసుకున్న రైతుల వివరాలను బ్యాంకులకు అందజేయడంలో సింగిల్ విండోలు, కేడీసీసీ బ్యాంకు శాఖలు నిర్లక్ష్యం చేశాయని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 52 సింగిల్ విండోలున్నాయని, ఏ సింగిల్ విండో పరిధిలోనూ వందశాతం రుణమాఫీ జరగలేదని చెబుతున్నారు. వంద శాతం కాదు కదా! కనీసం 50 శాతం సైతం రుణమాఫీ జరగలేదని పేర్కొంటున్నారు. మాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనతో వ్యవసాయశాఖ, బ్యాంకు అధికారులను కలిస్తే తమకు వచ్చిన జాబితాల ప్రకారం పంపించామని, సింగిల్ విండోల నుంచి జాబితాలు పూర్తిస్థాయిలో రాలేదంటున్నారు. పరపతి సంఘాల నుంచి బ్యాంకర్లకు, వ్యవసాయ శాఖ అధికారులకు పంపించిన రైతు రుణ జాబితాల్లో చాలా తప్పులు దొర్లినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కొన్ని కేసుల్లో రైతులకు రుణమాఫీ కాకపోవడానికి పరపతి సంఘాల నిర్లక్ష్యం సైతం కారణమంటున్నారు. రైతులు ప్రతి ఏడాది రుణాన్ని రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారని, రెన్యువల్ అయిన తేదీనే రుణం తీసుకున్న తేదీగా చూపించాల్సి ఉంటుంది. కానీ విండోలు అలా చూపించక రైతు మొదట అప్పు తీసుకున్న తేదీని చూపించడంతో ప్రభుత్వం పెట్టిన కటాఫ్ డేట్ పరిధిలోకి రాకుండా పోయారని, దీంతో రుణమాఫీకి నోచుకోలేదని రైతులు వాపోతున్నారు. అలాగే రైతుల ఆధార్‌కార్డులను, పాస్‌పుస్తకాలను వారి ఖాతాలతో జతపర్చే విషయంలోను నిర్లక్ష్యం జరిగిందని, చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదంటున్నారు. ధర్మపురి జైన సింగిల్ విండో పరిధిలోనే 18 మంది రైతుల ఆధార్‌కార్డు నమోదులో తప్పిదాలు జరిగాయని, వారందరూ రుణమాఫీకి నోచుకోలేదని రైతులు చెబుతున్నారు.
.. పై చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు జనగాం రాములు. మల్యాలకు చెందిన ఇతనికి గ్రామంలో మూడెకరాల భూమి ఉంది. పెట్టుబడి కోసం మల్యాల కేడీసీసీ కో ఆపరేటివ్ బ్యాంకుల గతేడాది సెప్టెంబర్ 23న లక్ష రుణం తీసుకున్నడు. ఈ క్రమంలో బ్యాంకు అధికారులు లోన్‌లో 10 వేలు వాటాధనంగా మినహాయించుకొని 90 వేలు ఖాతాలో జమ చేశారు. కాంగ్రెస్ సర్కారు జూన్‌లో రుణమాఫీ చేస్తామని చెప్పడంతో సంబురపడ్డాడు. మొదటి జాబితాలనే మాఫీ అవుతుందని భావించగా, మూడు విడతలు పూర్తయినా మాఫీ కాలేదు. దీంతో రాములు బ్యాంకుకు వెళ్లి వివరాలు అడిగితే అతని పేరు మీద 2,02,723 లక్షల అప్పు నమోదై ఉందని చెప్పడంతో కంగుతిన్నాడు. లక్ష లోన్ తీసుకుంటే 2లక్షల మీద ఎట్ల చూపిస్తదని బ్యాంకు అధికారులను అడిగితే సాంకేతిక లోపంతో తప్పుగా నమోదైందని సమాధానం ఇచ్చారు. అధికారులు చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని రాములు గత నెల 28న పూర్తి వివరాలు, తన బ్యాంకు స్టేట్మెంట్లతో సహా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ‘సాంకేతిక నైపుణ్యంతో పొరబాటు జరిగినట్టు నేను భావించడం లేదు. కావాలని ఎవరో వ్యక్తులు నా పేరుపై అదనంగా లక్ష రుణం తీసుకొని వినియోగించుకున్నారని అనిపిస్తుంది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలి’ అని కోరుతూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ విషయమై మల్యాల కేడీసీసీ బ్యాంకు సీఈవో శ్రీనివాస్‌ను వివరణ కోరగా, సాంకేతిక కారణాలతో జనగాం రాములుకు రుణమాఫీ కాలేదని, ఫిర్యాదు విషయమై జిల్లా ఇంటలెక్టో కమిటీకి రాతపూర్వకంగా నివేదిక ఇచ్చామని, రైతుకు న్యాయం చేస్తామని తెలిపారు.
ధర్మపురి మండలం జైనకు చెందిన కొస్న రాంరెడ్డి అనే రైతుది మరో వ్యథ. రాంరెడ్డికి గ్రామంలో 4.30 ఎకరాల భూమి ఉండగా, జైన సింగిల్ విండోలో 2017లో 60వేలు లోన్ తీసుకున్నాడు. రాంరెడ్డి తండ్రి నారాయణరెడ్డి సైతం తన భూమిపై 50వేల అప్పు తీసుకున్నాడు. అయితే, అంతలోనే నారాయణరెడ్డి చనిపోవడంతో ఆయన పేరిట ఉన్న 50వేల అప్పును రాంరెడ్డి, ఆయన సోదరుడికి రెండు భాగాలుగా అధికారులు పంపిణీ చేశారు. కేసీఆర్ హయాంలో రాంరెడ్డి తీసుకున్న 60వేలు, తండ్రి మరణాంతరం వచ్చిన 25వేల అప్పు వడ్డీతో కలిపి 87వేలు మాఫీ అయ్యాయి. గతేడాది రాంరెడ్డి సింగిల్ విండోకు వెళ్లి 1.50 లక్షల పంట రుణం ఇవ్వాలని అడుగగా, సింగిల్ విండో అధికారులు ఇవ్వకపోవడంతో ధర్మపురిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకును సంప్రదించాడు. పంట రుణం ఇస్తామని, అయితే ఇతర బ్యాంకుల్లో లోన్ తీసుకోలేదని, అప్పు లేదనట్టు నో డ్యూ సర్టిఫికెట్ తేవాలని సూచించడంతో జైన సింగిల్ విండో నుంచి బాకీ లేనట్టు నో డ్యూ సర్టిఫికెట్‌ను తీసుకున్నాడు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సమర్పించగా, బ్యాంకు అధికారులు గతేడాది సెప్టెంబర్ 8న రాంరెడ్డికి 1.50లక్షల లోన్ ఇచ్చారు. అయితే, ఇటీవల జరిగిన రుణమాఫీ జాబితాలో రాంరెడ్డి పేరు లేదు. ఆశ్చర్యపోయిన రాంరెడ్డి అధికారులను సంప్రదించగా, ‘నీవు రెండు చోట్ల లోన్ తీసుకున్నవ్. నీకు మొత్తం రెండు లక్షలకు పైగా రుణం ఉంది’ అని చెప్పడంతో రాంరెడ్డి నిర్ఘాంతపోయాడు. వెంటనే జైన సింగిల్ విండోకు వెళ్లి పరిశీలించగా, 87వేలు అప్పు ఉన్నట్టు రికార్డుల్లో నమోదై ఉంది. ఎప్పుడో 2018లో మాఫీ అయిన రుణం, నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత సైతం ఎలా కనిపిస్తుందో అర్థం కావడం లేదంటూ రాంరెడ్డి వాపోతున్నాడు. కాగా, ఈ విషయమై జైన పరపతి సంఘం సీఈవోను సంప్రదించగా, గ్రామంలో కొస్న రాంరెడ్డి సన్నాఫ్ నారాయణరెడ్డి ఇద్దరు ఉన్నారని, పొరపాటున ఒకరి రుణం ఒకరి పేరుపై నమోదు కావడంతో రుణమాఫీ జరుగలేదని వివరణ ఇచ్చారు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.