కథలాపూర్, డిసెంబర్ 23: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాలలో అనుమానాస్పదంగా 16 మంది బంగ్లాదేశ్ కూలీల మిస్టరీ వీడింది. టూరిస్ట్ వీసాలపై ఇండియాకు వచ్చి బీహార్ కూలీల పేరిట తెలంగాణలో నాట్లు వేస్తూ జీవిస్తున్నారని పోలీసులు గుర్తించారు. వీరు రెండేండ్ల క్రితమే ఇక్కడికి వచ్చినట్లు తేల్చారు. గత ఆదివారం తెల్లవారుజామున గ్రామంలో కొందరు అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి చేరుకొని మొదట ఉత్తరప్రదేశ్ కూలీలుగా అనుమానించి అదుపులోకి తీసుకున్నారు.
వీరి నుంచి వీసా, పాస్‌పోర్టు ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటని క్షుణ్ణంగా పరిశీలించారు. వీరిని రహస్యంగా విచారించారు. వీసా గడువు తీరినప్పటికీ ఇక్కడే ఉంటున్నట్లు నిర్ధారించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాలకు చెందిన మధ్యవర్తుల ద్వారా తాండ్య్రాలకు వచ్చినట్లు గుర్తించారు. మధ్యవర్తుల మధ్య మనస్పర్థలు రావడంతో వీరి విషయం బయటకు పొక్కినట్లు తెలిసింది. శుక్రవారం వీరిని పోలీసులు భారీ బందోబస్తు మధ్య బంగ్లాదేశ్‌కు తరలించడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.