Congress leaders | వేములవాడ, ఆగస్టు 25: కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ మంగళవారం పర్యటించనున్నారు. కాగా తెలంగాణ చౌక్ లో వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను సోమవారం దగ్ధం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొప్పదండి పర్యటనలో బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలుపొందారని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
దీంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పలుచోట్ల మహేష్ కుమార్ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు సోమవారం దగ్ధం చేశారు. ఇందులో భాగంగానే వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ లో వేములవాడ రూరల్ బీజేపీ నాయకులు మహేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేయగా పోటాపోటీగా సాయంత్రానికల్లా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వకుళాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడమే కాకుండా బీసీ వ్యతిరేకి అంటూ నినాదాలు చేశారు.
ఉదయం మహేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే సమయంలో బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు, సాయంత్రం తెలంగాణ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన దిష్టిబొమ్మ దహనానికి పూర్తిగా సహకరించినట్లు కనిపించింది. మరోవైపు తెలంగాణ చౌక్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన ఉండగా ఆయన దిష్టిబొమ్మ దగ్ధం వేములవాడలో చర్చనీ అంశంగా మారింది.