Bandi Sanjay birthday | హుజురాబాద్ టౌన్, జూలై 11: బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బండి సంజయ్ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగారని అన్నారు.
భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన విస్తరించడంలో బండి సంజయ్ కృషి ఎనలేనిదని కొనియాడారు. కార్యకర్తకు భరోసా కల్పించడంలో బండి సంజయ్ ముందుంటారన్నారు. అటు కేంద్రమంత్రిగా ఇటు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా సక్రమంగా బాధ్యతను నిర్వహిస్తూ గొప్ప పేరు సంపాదించుకున్నారన్నారు. బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు 20 వేల సైకిళ్లను పంపిణీ చేయడం ఆయన గొప్ప మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, సీనియర్ నాయకులు నల్ల సుమన్, వాసు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.