Sunke Ravishankar | గంగాధర, మే 18: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై సోమవారం నిర్వహించిన ధర్నా రాస్తారోకో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, నేరాలు జరుగుతున్న పోలీసులు కల్లప్పగించి చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేటీ బచావో-బేటీ పడావో అనే నినాదాన్ని తీసుకువస్తే, అదే ప్రభుత్వంలోని మంత్రుల కుమారులు మహిళలను, మైనర్ బాలికలపై లైంగిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిని కాపాడడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల, సోషల్ మీడియా వారియర్స్ చేసిన ఉద్యమంతో ప్రభుత్వం దిగివచ్చి బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు చేసిందన్నారు. బండి భగీరథ కేసులో తన పేరు వాడద్దని బండి సంజయ్ కోర్టుకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి బండి సంజయ్ ను కేంద్రం మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేచినేని నవీన్ రావు, సాగి మహిపాల్ రావు, కంకణాల విజయేందర్ రెడ్డి, అయిలినేని సాగర్ రావు, సత్తినేని మాధవ్, కత్తెరపాక కొండయ్య, గడ్డం చుక్కారెడ్డి, ఎండి నజీర్, తోట మహిపాల్, పంజాల ఆంజనేయులు, దోమకొండ మల్లయ్య, నిమ్మనవేని ప్రభాకర్, మామిడిపల్లి అఖిల్, గంగాధర సంపత్ తదితరులు పాల్గొన్నారు.