కరీంనగర్ విద్యానగర్, సెప్టెంబర్ 9 : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంతో, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారిమళ్లించేందుకు కాంగ్రెస్ సర్కారు ‘హైడ్రా’ పేరిట డ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొని మాట్లాడారు.
కొన్ని రోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే విశ్వాసం పోతున్నదని, సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులు, పేదల ఇండ్లను కూలుస్తున్నారని, ఇకపై ఇలా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదని, అక్రమ భవనాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని, ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అతి తకువ కాలంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురొంటున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని విమర్శించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీరెడ్డి పాల్గొన్నారు.