Kaushika hari | గోదావరిఖని : మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఆప్రజాస్వామిక చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, దానిని ఎలాగైనా అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేసిందని, ఆ కుట్రలను తిప్పి కోట్టేందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి రంగంలోకి దిగి గుండాయీజనికి తెగబడి గొడవలు సృష్టించారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసి తిరిగి బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను జైలుకు పంపడానికి కుట్ర చేశారని ఆయన విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఇక్కడ జరుగుతున్న వ్యవహారాల మీద ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. బాల్క సుమన్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రామగుండం నియోజకవర్గంలో గూండా పాలన సాగుతుందని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఆధ్వర్యంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని, పోలింగ్ అనంతరం ఈనెల 12న రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని పోలింగ్ బాక్స్ లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములో ఏం జరిగిందనేది సీసీటీవీ ఫుటేజ్ లను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఓడిపోతారనుకునేవారు గెలిచారని, గెలుస్తారని పక్కా ధీమాతో ఉన్నవారు ఓడిపోయారని, ఇందులో ఏదో మతలబు జరిగిందని దానిని నిగ్గు తేల్చాల్సిన అవసరం పరిగణలోకి తీసుకొని రామగుండం పోలీస్ కమిషనర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ గుండాయిజంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నడిపెల్లి మురళీధర్ రావు, మేకల సమ్మయ్య, పర్లపల్లి రవి, జేవి రాజు తదితరులు పాల్గొన్నారు.