వేములవాడ, ఏప్రిల్ 16: కాంగ్రెస్ అంటేనే ఝూటా పార్టీ అని, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని జగిత్యాల సభ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన ప్రజలకు అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిపాజిట్ కూడా దక్కదని మండిపడ్డారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని శ్రీనివాస కల్యాణం మండపంలో గురువారం జగిత్యాల కేసీఆర్ సభ సన్నాహక సమావేశం నిర్వహించగా, బాల్క సుమన్ హాజరై మాట్లాడారు.
వేములవాడ పట్టణానికి కోట్లాది రూపాయల నిధులను కేటాయించి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని కేసీఆర్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే.. కాంగ్రెస్ పాలనలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలను గద్దల్లా పీక్కు తింటున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌కు తెలంగాణపై ఎలాంటి ఆత్మ లేదని, చంద్రబాబు పరిపాలన ముద్ర మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను ఏ ఒకటి నెరవేర్చకుండా అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు.
రెండున్నరేళ్లలో రేవంత్ రెడ్డి రూ.3లక్షల కోట్ల అప్పులు చేసి ఏం అభివృద్ధి చేశాడో ప్రజలు నిలదీయాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆది శ్రీనివాస్‌తోపాటు మకాన్ సింగ్ కుటుంబంతో సహా కంటతడి పెట్టారని, ఇప్పుడేమో ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఇప్పుడు నరుకుతా అని అంటున్నారని మండిపడ్డారు. ఇదేనా ప్రజా పాలన..? అని నిలదీశారు. అనంతరం బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా ప్రచారానికి ఇచ్చే ప్రాధాన్యత అభివృద్ధి పనికిమాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు.
రెండున్నరేండ్ల పాలనలో ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోయిందని ఎద్దేవా చేశారు. రాజన్న ఆలయ వైభవాన్ని తగ్గించేలా నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి మీద ధ్యాస పెట్టి నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి గానీ, మీడియా, సోషల్ మీడియాకు మాత్రమే కనిపిస్తూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. సమావేశంలో నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, డైరెక్టర్లు హరి చరణ్ రావు, దేవరాజు, ఆకుల రంగారాం, శ్రీనివాస్ రావు, నాయకులు రాఘవరెడ్డి, గోసుల రవి, భూమయ్య, దేవయ్య, ఎల్లయ్య, రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, తిరుపతి రెడ్డి, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, చంద్రయ్య గౌడ్ ఉన్నారు.